జనసేన అభ్యర్ధుల మొదటి జాబితా..ఎవరెవరంటే..???

వాస్తవం ప్రతినిధి: ఏపీలో ఈ సారీ ఎన్నికల పోటీ రసవత్తరంగా సాగనుంది. ముక్కోణపు సీరీస్ లో సీఎం కప్పు ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జనసేన మినహా మిగిలిన పార్టీలు చూచాయిగా పార్టీ అభ్యర్ధులని డిసైడ్ చేశాయి. ముఖ్యంగా వైసీపీ ఈ విషయంలో ముందుంది. తెలంగాణలో కేసీఆర్ లాగానే జగన్ కూడా ముందు నుంచీ అభ్యర్ధుల విషయంలో ఎక్కడికక్కడ ప్రకటనలు చేస్తూ చాలా చోట్ల అభ్యర్ధులని డిసైడ్ చేశారు.

ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత ఇంకా అభ్యర్ధుల విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే అభ్యర్ధిని గతంలో ప్రకటించారు తప్ప మరెవరిని అధికారికంగా ప్రకటించలేదు. కాని కొంత మంది పేర్లని కొన్ని స్థానాల నుంచీ పరిసీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు చాలా నియోజక వర్గాలలో దాదాపు అభ్యర్ధుల ఎంపిక ఖరారు అయ్యారని కేవలం ప్రకటనలు చేయడమే ఆలస్యం అంటున్నారు. ఇంతకీ పవన్ మదిలో ఉన్న ఆ అభ్యర్ధులు ఎవరంటే.

జనసేనాని సంక్రాంతి రోజున కాని , లేదా సంక్రాంతి తరువాత కాని పార్టీ నుంచీ పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాని ప్రకటించనున్నారని తెలుస్తోంది. విశాఖ నుంచీ నాలుగు స్థానాలలో అభ్యర్ధుల ప్రకటన ఉంటుదట. విశాఖ తూర్పు నుంచీ చిరంజీవి అభిమానుల సంఘం నాయకుడు ఎం.రాఘవరావు పేరు వినిపిస్తోందట. ప్రస్తుతానికి అక్కడ ఆయనకీ జనసేన నుంచీ పోటీగా ఎవరూ లేరని కూడా తెలుస్తోంది.ఇదిలాఉంటే , విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి బొలిశెట్టి సత్య, గేదెల శ్రీనుబాబు పోటీ పడుతున్నారట. అలాగే విశాఖ పశ్చిమ టిక్కెట్‌ డాక్టర్‌ సునిత, పీవీ సురేశ్‌ లు, విశాఖ ఉత్తరం గుంటూరు భారతి, పసుపులేటి ఉషాకిరణ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు కాపునేత ముద్రగడ పద్మనాభం శిష్యుడు తోట రాజీవ్‌ కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సెగ్మెంట్ లోనే ఎక్కువ పోటీ ఉంది.

ఇక విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన గంపల గిరిధర్‌, రాహుల్‌ టిక్కెట్లు ఆశిస్తున్నారు.అలాగే భీమిలి నుంచి విద్యాసంస్థల అధినేత అలివర్‌ రాయ్‌తో పాటు ముత్తంశెట్టి కృష్ణారావు పేరు వినిపిస్తోంది. పెందుర్తి నుంచి ప్రస్తుతానికి మండవ రవికుమార్‌ లైన్ లో ఉన్నారట. గాజువాకకు మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య పేరు దాదాపు ఖరారు అయినట్టుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు

అనకాపల్లి నుంచీ ముత్తం శెట్టి కృష్ణారావు పేరు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గానికి సీతారామ్‌ పేరు వినపడగా. దాడి గనుకా పార్టీ లో చేరితే టిక్కట్టు ఆయనకీ వెళ్ళడం ఖాయంగా తెలుస్తోంది. . చోడవరం నుంచి పీవీఎస్‌ఎన్‌ రాజు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఇంకెవరూ పోటీ లేరు. కాబట్టి ఆయన ఒక్కరి పేరే పరిశీలనలో ఉంది . పాయకరావుపేటకు నక్కా రాజారావు, శివదత్తుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇలా దాదాపు విశాఖ నుంచీ చాలా మటుకు నియోజకవర్గాలో అభ్యర్ధుల కసరత్తు జరుగుతోందని.చాలా మందికి స్థానాలు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ సంక్రాంతికి మొదటి జాబితా గనుకా సిద్దం చేస్తే తప్పకుండా పార్టీకి మాంచి ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.