వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియాలో తొలిసారి భారత్ టెస్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2-1 తేడాతో చారిత్రక సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా ఈ గెలుపుతో ఆసీస్ గడ్డపై సిరీస్ విజయాన్ని నమోదు చేసిన తొలి ఆసియా కెప్టెన్గా విరాట్ కోహ్లీ చరిత్ర పుటల్లోకెక్కాడు. చివరిదైన నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్ భారత్ వశమైంది. 2011 ప్రపంచకప్ విజయం కంటే.. ఈ గెలుపు తనకు ఎంతో గొప్పదని కోహ్లీ పేర్కొన్నాడు. ట్రోఫీ ప్రదానోత్సవం అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ…..
‘ఈ విజయం నా కెరీర్లో ఎంతో ఉత్తమమైనది. భారత్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు.. ఆ జట్టులో నేను చిన్నవాడిని. ఆ సమయంలో జట్టులోని ప్రతి ఒక్కరూ విజయంతో ఎంతో భావోద్వేగానికి గురవడం నేను చూశా. అయితే నేను అప్పుడు అలా ఫీల్ కాలేకపోయా. ఇక్కడికి మూడుసార్లు వచ్చిన అనంతరం విజయం ఎంత కఠినమో తెలిసొచ్చింది. నేను టెస్టు కెప్టెన్గా ఆస్ట్రేలియా గడ్డపైనే బాధ్యతలు చేపట్టా. ఇక్కడి నుంచే మార్పు ప్రారంభమైంది. ఇప్పుడు ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనది’ అని కోహ్లీ అన్నాడు.