ఉత్తమ్ పై నిప్పులు చెరిగిన సర్వే సత్యనారాయణ

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కు గురైన మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. ఏఐసీసీ నేత అయిన‌ తనను.. సస్పెండ్‌ చేసే అధికారం ఉత్తమ్‌కు లేదని స్పష్టం చేశారు. పార్టీ కోసం ఉత్తమ్‌ ఏం చేస్తున్నాడని సర్వే నిలదీశారు. శాసనసభ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకొని.. పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణమైన వారే సమీక్షలు చేయడాన్ని ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుందని సర్వే వ్యాఖ్యానించారు. ఉత్తమ్‌, కుంతియా జోడిని ఇంటికి పంపి.. కాంగ్రెస్‌ ను కాపాడాలని అధిష్టానాన్ని కోరుతానని ఆయన చెప్పారు. న‌న్ను తీసేసే అధికారం వారికి ఉందా? నేను ప్ర‌శ్నిస్తే పార్టీ నుంచి తీసేస్తారా? అని మండిప‌డ్డారు. త్వరలోనే నా సస్పెన్షన్‌పై అధిష్టానాన్ని కలుస్తా. నన్ను తప్పించిన వాళ్ల భరతం పడతాన’ని వ్యాఖ్యానించారు. అలానే టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను సర్వే సత్యనారాయణ ప్రశంసించారు. ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు వారు కష్టపడుతున్నారని ఆయన అన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన కేసీఆర్ 48 గంటల పనిని 24 గంటల్లో చేస్తూ.. ప్రజల మన్ననలు పొందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.