పాక్ కు యూఏఈ భారీ ఆర్ధిక సాయం

వాస్తవం ప్రతినిధి: పొరుగుదేశం పాకిస్తాన్ కు యూఏఈ భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. యూఏఈ రాజు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ ఆదివారం పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశానికి యూఏఈ రాజు 6.2 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించే అవకాశముంది. ఈ అర్థిక సహాయం విషయమై గతంలో ఇరు దేశాల మధ్య సంప్రదింపులు కూడా జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. దీనికి తోడు విదేశీ మారక నిల్వలు కూడా అడుగంటిపోయిన నేపధ్యంలో ప్రధాని ఇమ్రాన్ తమను ఆదుకోవాలంటూ పలు వేదికల్ పై అంతర్జాతీయ ద్రవ్య నిధిని (ఐఎంఎఫ్‌) కోరారు.  తమ ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తీసుకురావడం సహా.. జీతాల సమస్యను నివారించుకొనేందుకు ఐఎంఎఫ్‌ నుంచి సుమారు 8 బిలియన్ డాలర్ల బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీని కోరింది. అయితే, తాజాగా యూఏఈ చేయబోయే ఈ ప్రత్యేక సాయంతో పాక్‌కు విదేశీ మారక నిల్వలు పెంచుకొనేందుకు, ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు అవకాశం లభించనున్నట్లు తెలుస్తుంది.