రసాభాస గా మారిన షాదీ ఖానా భూమి పూజ కార్యక్రమం

వాస్తవం ప్రతినిధి: కర్నూల్ జిల్లా లోని ఆత్మకూరులో షాదీఖానా నిర్మాణం కోసం చేపట్టిన భూమి పూజ కార్యక్రమం రసాభాసగా మారింది. భూమి పూజ చేసేందుకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎన్‌.ఎమ్‌.డీ ఫరూక్‌ను హజ్‌ కమిటీ చైర్మన్‌ అహ్మద్‌ హుస్సేన్‌ అడ్డుకోవడం తో ఆ కార్యక్రమం రసాభాసగా తయారైంది. పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ అహ్మద్‌ కుమారుడితో సహా పలువురు నిరసనకు దిగారు. ఫరూక్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మైనార్టీలను అణగదొక్కాలని చూస్తున్నారంటూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సమస్యలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలే గానీ పార్టీకి నష్టం కలిగేలా ప్రవర్తించడం సరికాదంటూ మంత్రి ఫరూక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నౌమన్‌, బుడ్డా రాజశేఖరరెడ్డి, అహ్మద్‌ హుస్సేన్‌ తదితరులతో కలిసి షాదీఖానా భూమి పూజ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తుంది.