11 మంది టీడీపీ సభ్యుల పై కొరడా ఝాలిపించిన స్పీకర్

వాస్తవం ప్రతినిధి: నిన్న సభలో 24 మంది అన్నాడీఎంకే సభ్యులు సస్పెండ్ కు గురైన సంగతి తెలిసిందే. స్పీకర్ సుమిత్రా మహాజన్ నిరసనలకు దిగిన 24 మంది అన్నాడీఎంకే సభ్యుల పై సస్పెన్షన్ వేటు పడిన సంగతి ఇంకా మరువక ముందే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ఆందోళనకు దిగిన టీడీపీ లోక్ సభ సభ్యులకు కూడా స్పీకర్ సుమిత్రా మహాజన్ షాకిచ్చారు. తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని చెప్పినా వినకపోవడంతో కొరడా ఝుళిపిస్తూ పార్లమెంటులో 11 మంది టీడీపీ సభ్యులను నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. టీడీపీ నేతలు గల్లా జయదేవ్, మురళీ మోహన్, రామ్మోహన్ నాయుడు, తోట నరసింహం, బుట్టా రేణుక, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాగంటి బాబు, శ్రీరామ్ మాల్యాద్రి, అశోక్ గజపతి రాజు, కొనకళ్ల నారాయణ, జేసీ దివాకర్ రెడ్డిపై స్పీకర్ ఈరోజు సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ నేపథ్యంలో సభ నుంచి బయటకు వెళ్లాలని కోరగా అందుకు టీడీపీ నేతలు నిరాకరించారు. లోక్ సభలోనే తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం సభను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసినట్లు తెలుస్తుంది. .