జగనే సీఎం…ఉండవల్లి పోలీస్ సర్వే..!!!

వాస్తవం ప్రతినిధి: ఎన్నికల వేళ సర్వేలు సర్వ సాధారణం. ఏపీలో సర్వేలు పేరు చెప్తేనే గుర్తొచ్చేది లగడపాటి సర్వే.. అయితే ఇప్పుడు మరొక సర్వే పేరుతో ఏపీలో అలజడి సృష్టిస్తున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ సర్వే చూసి టీడీపీ నేతలు షాక్ కి గురయ్యారు. ఇదెక్కడి లాజిక్ అంటూ తలలు పట్టుకుంటున్నారు. అంతేకాదు ప్రతీ నియోజక వర్గ ఎమ్మెల్యే పోలీసులని పిలిపించుకుంటున్నారట. ఎందుకంటే తాము వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనేది తెలుసుకోవడానికి. అదేంటి అందుకు ప్రజల వద్దకి వెళ్ళాలి కాని పోలీసులని పిలవడం ఏమిటి అనుకుంటున్నారా..?? కొంచం కన్ఫ్యూజింగ్ టాపిక్ అయినా చివరికి క్లారిటీ దొరుకుతుందిలెండి. వివరాలలోకి వెళ్తే.

ఇంతకీ ఉండవల్లి వదిలిన సర్వే రిపోర్ట్ ఏమిటి..?? ఈ రిపోర్ట్ కి పోలీసులకి లింక్ ఏమిటి ..?? అంటే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది జగనే అంటూ కుండబద్దలు కొట్టారు ఉండవల్లి. అందుకు పోలీసులతో లింక్ పెడుతూ ఓ సర్వేని కూడా ప్రకటించారు. అంతేనా సర్వేలు విశ్లేషణలు ఇవి ఏవీ కూడా నిజం కాదని ప్రజల మధ్య ఉండి వారిని దగ్గరగా చూసిన వారు మాత్రమే ప్రజల నాడి చెప్పగలరని అది కేవలం పోలీసులకి మాత్రమే సాధ్యం అని పోలీసు బాసులని ఇరకాటంలో నెట్టారు..అందుకు తగ్గట్టుగా లాజిక్ చెప్పారు.

ఒక పోలీస్ అధికారి ఎవరైనా సరే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేకు సెల్యూట్ చేయకపోతే ఆ పార్టీ అధికారంలోకి రాదని ఆయన నిర్ధారించారు. అదే ప్రతిపక్షనేతకు ఒక పోలీసు సెల్యుట్ చేసాడంటే ఆయా నియోజకవర్గంలో ఆ నేత తప్పకుండా అధికారంలోకి వస్తాడని ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు. ఎందుకంటే పోలీసులు నిరంతరం ప్రజల వద్దనే ఉంటారు కాబట్టి వారికి ఓటరు యొక్క నాడి తెలుస్తుంది. పాదయాత్రలో జగన్ కి వస్తున్న స్పందన చూసిన పోలీసులు ఈ విధంగానే డిసైడ్ అయ్యారని ఆయన అభిప్రాయ పడ్డారు.

అంతేకాదు జగన్ తన తండ్రి కంటే కూడా బాగా మాట్లాడగలరని ఆయన అభివర్ణించారు. పనిలో పనిగా బాబుని కూడా వెటకారం చేస్తూ “వాట్ ఐయామ్ సేయింగ్” లాంటి పదాలు ఎక్కడా జగన్ వాడటం లేదని అన్నారు. ప్రజలలో వచ్చిన స్పందనతో గెలుపుపై ధీమాగా ఉండటం సరికాదని..చంద్రబాబు నాయుడు మామూలోడు కాదు అంటూ జగన్ కి సూచనలు చేశారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది కాని ఇప్పుడు ఈ సరికొత్త సర్వే పేరుతో ఉండవల్లి పోలీసులని ఇబ్బందుల్లోకి నెట్టేశారని చెప్పడంలో సందేహం లేదు. మరి ఎంతమంది పోలీసులని తమ తమ ఎమ్మెల్యేలు మంత్రుల నుంచీ పిలుపు వస్తుందో వేచి చూడాలి.