కన్నడ నటీనటుల ఇళ్ళ లో ఐటీ సోదాలు

వాస్తవం సినిమా: కన్నడ నటీనటుల ఇళ్ళ లో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. బెంగళూరు సదాశివనగర్‌లోని పునీత్‌ రాజ్‌కుమార్‌ నివాసం సహా.. మన్యతా టెక్‌ పార్క్‌లోని ఆయన సోదరుడు శివరాజ్‌కుమార్‌కు చెందిన ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. అలానే మరికొందరు ప్రముఖుల ఇళ్ళ లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వారిలో నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌, నటుడు సుదీప్‌, కేజీఎఫ్‌ హీరో యశ్‌ లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. నటీనటులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు మొత్తం 25 చోట్ల ఐటీ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాక్‌లైన్‌ వెంకటేశ్‌ సహా.. నిర్మాతలు జయన్న, కేజీఎఫ్‌ చిత్ర నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ నివాసాల్లో సైతం ఐటీ దాడులు జరుగుతున్నాయి. రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత అయిన రాక్‌లైన్‌ వెంకటేశ్‌.. కన్నడ, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఎక్కువగా సినిమాలు తీశారు. పలు హిట్‌ చిత్రాలకు పంపిణీదారుగానూ వ్యవహరించారు. 2015లో రాక్‌లైన్‌ వెంకటేశ్‌ నిర్మించిన బజరంగీ భాయ్‌జాన్‌ చిత్రానికి గానూ జాతీయ పురస్కారం కూడా లభించిన సంగతి తెలిసిందే.