వర్మపై ఏపీ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కేసులు

వాస్తవం సినిమా: సంచలన – వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో ఊహించని పరిణామంతో వార్తల్లో నిలిచారు. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమాలోని ‘వెన్నుపోటు’ పాట వివాదానికి దారితీసింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఓ పోస్టర్ మాత్రమే విడుదల కాగా – తాజాగా వెన్నుపోటు అనే సాంగ్ ని విడుదల చేశాడు. ఈ పాటపై – వర్మపై టీడీపీ నాయకులు భగ్గుమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిచేలా – ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా వర్మ వ్యవహరించారని మండిపడుతున్నారు. వర్మపై ఏపీ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. చంద్రబాబుని అవమానించేలా పాట రూపొందించడం కరెక్ట్ కాదని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు పోలీస్ స్టేషన్లో వర్మపై ఆయన ఫిర్యాదు చేశారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ – చిత్ర బృందంపై మోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మపై క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు ఏదో చేశారని అనడం అవాస్తవం అన్నారు. ఈ సినిమా వెనుక వర్మ ఒక్కడే ఉన్నాడంటే తాము నమ్మలేము అని – వర్మ వెనుక ఉన్నవారిని కూడా గుర్తించి వారిపైనా కేసులు నమోదు చేయాలని మోహన్ రెడ్డి అన్నారు. వర్మ వెనుక ఉన్న కుట్రదారులు ఎవరో తేల్చాలన్నారు. శిఖండిలా వర్మను అడ్డుపెట్టుకుని ఆడటం కాదు.. దమ్ముంటే ఎదురుగా రావాలని ఎస్వీ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు.