ట్యాంపరింగ్ కు అవకాశమే లేదు: సునీల్ అరోరా

వాస్తవం ప్రతినిధి: ఈవిఎంల ట్యాంపరింగ్‌కు అవకాశమేలేదని ప్రధాన ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. ఈ వి ఎం ల ద్వారా చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని కనిష్టస్థాయికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ కారణంగా తిరిగి బ్యాలెట్‌ విధానానికి వెళ్లడం సరికాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే కొన్ని రాజకీయ శక్తులు ఈ అంశాన్ని ‘ఫుట్‌బాల్‌’లాగా ఆడుకుంటున్నాయని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాల వెలువడిన అనంతరం రాజకీయ నాయకులు ఇసిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారని, అది సరైంది కాదని తెలిపారు. టాంపరింగ్‌, లోపాలు అనేవి రెండు వేర్వేరు అంశాలని టాంపరింగ్‌ అనేది పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతుందని తెలిపారు. ఇవిఎంల పనితీరులో కొన్ని లోపాలు వుండవచ్చునని అన్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం, చత్తీస్‌ఘడ్‌, తెలంగాణాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం 1.76 లక్షల పోలింగ్‌బూత్‌లను ఏర్పాటు చేశామని, వాటిలో కొన్ని ఇవిఎంలలో మాత్రమే లోపాలు వెలుగులోకి వచ్చాయని, ఇవి ఒక్కశాతం కంటే తక్కువేనని అన్నారు. అలాగే ఇవిఎంలను ముందుగానే ప్రోగ్రామింగ్‌ చేయడం సాధ్యం కాదని అన్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వాడిన ఈవిఎంలనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వాడామని, వేర్వేరు ఫలితాలు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.