ఐఆర్ సీ టీసీ కుంభకోణం కేసు లో లాలూ కి తాత్కాలిక ఊరట

వాస్తవం ప్రతినిధి: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలడం తో ఝార్ఘండ్ లోని రాంచీ లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత,బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐఆర్‌సీటీసీ కుంభకోణానికి సంబంధించి రెండు కేసుల్లో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ఢిల్లీ పాటియాలా హౌస్‌ కోర్టు లాలూకు జనవరి 19 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. మరో కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేడు విచారణకు హాజరయ్యారు. ఆరోగ్య కారణాల రీత్యా లాలూ కోర్టుకు నేరుగా హాజరుకాలేకపోయారు. ఐఆర్‌సీటీసీకి చెందిన రెండు హోటళ్ల కాంట్రాక్టులను ఓ ప్రైవేటు సంస్థకు కేటాయించడంలో అవకతవలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పుడు లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. దీంతో ఈ కుంభకోణంలో లాలూ, ఆయన భార్య రబ్రీ దేవీ, కుమారుడు తేజస్వీ తదితరులపై ఆరోపణలు రావడంతో దర్యాప్తు సంస్థలు కేసులు నమోదుచేశాయి. దీనిపై విచారణ కొనసాగుతోంది.