పోలీసులకు లొంగిపోయెందుకు గడువు కోరిన సజ్జన్

వాస్తవం ప్రతినిధి: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్ కుమార్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. దీనితో ఆయనకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.  డిసెంబరు 31లోగా ఆయన పోలీసులకు లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది. 1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కులైన ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే దేశవ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో సజ్జన్‌తో పాటు అప్పటి కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ బల్వన్‌ ఖోఖార్‌, రిటైర్డ్‌ నేవీ అధికారి కెప్టెన్‌ భగ్మల్‌, గిర్‌ధారీ లాల్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో దోషిగా తేలడంతో సజ్జన్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు. అయితే ఈ కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్‌ పార్టీ మాజీ నేత సజ్జన్‌ కుమార్‌ పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు నెల రోజుల గడువు కావాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. ఈ పిటిషన్‌పై విచారణ శుక్రవారం జరిగే అవకాశం ఉంది. సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన రెండో కేసు విచారణ గురువారం ఢిల్లీ హైకోర్టులో జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన కోర్టు ఎదుట హాజరయ్యారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు సజ్జన్‌ కుమార్‌ తన మొబైల్‌ ఫోన్‌ను కోర్టుకు అందించారు. తన తరఫు న్యాయవాది అందుబాటులో లేని కారణంగా రెండో కేసు విచారణ వాయిదా వేయాల్సిందిగా సజ్జన్‌ న్యాయస్థానాన్ని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను జనవరి 22కి వాయిదా వేసినట్లు తెలుస్తుంది.