నేడు టీసీఎల్‌కు బాబు శంకుస్థాపన

వాస్తవం ప్రతినిధి: టీవీల తయారీ రంగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న చైనా కంపెనీ టీసీఎల్‌కు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. చైనాకు చెందిన ఈ కంపెనీ దాదాపు 2,200 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాల గ్రామ పరిధిలో ఈ కంపెనీ ఏర్పాటవుతోంది.

తూర్పు మండలాల్లో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ఇక్కడ టీసీఎల్‌ ఏర్పాటుకు చైనా ఆసక్తి చూపడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పరిశ్రమ ఏర్పాటైతే దాదాపు 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. పరిశ్రమకు శంకుస్థాపన జరుగుతున్న నేపథ్యంలో బుధవారం రాత్రే టీసీఎల్‌ చైర్మన్‌ లిడాంగ్‌ షెన్‌, ఇతర ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్‌ భేటీ అయి చర్చలు జరిపారు.

ఇక టీసీఎల్‌కు శంకుస్థాపన అనంతరం సీఎం తిరుపతి రూరల్‌ మండలం పాడిపేటలో నిర్మిస్తున్న 3300 ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు ఇళ్లపత్రాలు అందిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటకు తిరిగి తిరుపతి చేరుకుంటారు.