ప్రసాదం తిని 10 మంది మృతి

వాస్తవం ప్రతినిధి: దేవుడి ప్రసాదం కలుషితం కావడంతో అది తిని 11 మంది మృతి చెందగా పలువురు ఆసుపత్రిపాలయ్యారు. ఈ సంఘటన కర్ణాటకలో సంచలనం స‌ృష్టించింది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని చామరజనగర్‌లోని కిచ్చలవాడి గ్రామంలోని మారమ్మ దేవాలయంకు సంబంధించిన గోపుర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు పంచిన ప్రసాదం తిన్న వారిలో పది మంది మృతి చెందారు. 80 మంది తీవ్ర అస్వస్థత పాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రసాదంగా పంచిన టమాటా రైస్ దుర్వాసన వస్తోందని, దాంతో కొంత మంది పారేయగా, మరికొందరు తినేశారని అక్కడి భక్తులు చెప్పారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రసాదంలో క్రిమిసంహారక మందు కలవడమే కారణమని తేల్చారు. ఓ వర్గం పథకం ప్రకారం ప్రసాదంలో పురుగు మందు కలిపినట్టు అనుమానిస్తున్నారు. గోపుర నిర్మాణం విషయంలో అన్నదమ్ముల (కజిన్స్) మధ్య తలెత్తిన వివాదమే ఇందుకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాదితులు చికిత్స పొందుతున్న కేఆర్ఎస్ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. బీజేపీ నేత యడ్యూరప్పతోపాటు పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు. కాగా, మిగిలిపోయిన ప్రసాదాన్ని తిన్న కాకులు కూడా ఆ పరిసరాల్లో చచ్చి పడి ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.