అమెరికా బాటలోనే మేము ప్రయాణిస్తాం: పుతిన్

వాస్తవం ప్రతినిధి: అమెరికా రష్యా లమధ్య యుద్దవాతావరణం నేలకొనిందా అంటే నిజమే అనిపిస్తుంది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో బుధవారం వాషింగ్టన్‌లో జరిగిన నాటో దేశాల సమావేశంలో మాట్లాడుతూ తమ దేశం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఇంటర్మీడియట్‌ రేంజ్‌ న్యూక్లియర్‌ ఫోర్సెస్‌ ట్రీటీ-ఐఎన్‌ఎఫ్‌) నుండి మరో రెండు నెలల్లో వైదొలగనున్నట్లు చెప్పడం తో రష్యా కూడా హెచ్చరించింది. ఆయుధ ఒప్పందం నుండి వైదొలగి అమెరికా నిషిద్ధ క్షిపణి ప్రయోగాలను ప్రారంభిస్తే తాము కూడా అదే బాటలో నడుస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తాజాగా హెచ్చరించారు. అణ్వస్త్రాల విషయంలో రష్యా మోసానికి పాల్పడుతున్నందు వల్లే తాము ఈ ఒప్పందం నుండి విరమించుకోవాలని నిర్ణయించుకున్నామని మైక్ తెలిపారు. అయితే రష్యా ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. రష్యా, చైనాలు ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నందు వల్ల తాము ఈ ఒప్పందం నుండి వైదొలగుతామని ఈ ఏడాది ఆరంభంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఒప్పందం నుండి వైదొలగేందుకు అమెరికా కుంటి సాకులు చెబుతోందని,ఈ ఒప్పందం నుండి ఎందుకు బయటకు వెళ్లాలనుకుంటు న్నారో సహేతుకంగా చెప్పి అప్పుడు వైదొలగితే బాగుంటుందని ఆయన అన్నారు.