వజ్రాలు పొదిగిన విమానం!

వాస్తవం ప్రతినిధి: వజ్రాలు పొదిగిన వస్తువుల గురించి చెప్పుకుంటుంటే వింటూ ఆశ్చర్యానికి గురవుతుంటాం. అలాంటిది వజ్రాలు పొదిగిన విమానం ను ఎప్పుడైనా చూశారా. ఎమిరేట్స్ విమానయాన సంస్థ పోస్ట్‌ చేసిన ఓ విమానం ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. అయితే ఇందులో వింతేమి ఉందని అనుకుంటున్నారు కదూ. ఎందుకంటే ఆ విమానం మొత్తం వజ్రాలతో ధగధగా మెరిసిపోతుంది. ఎమిరెట్స్‌ అధికారిక ట్విటర్‌ పేజీలో ఈ ఫొటోను పోస్టు చేయడంతో చాలా మంది ఆశ్చర్యానికి గురికావడంతోపాటు.. ఇది నిజమేనా? అంటూ అనుమానాలూ కూడా వ్యక్తం చేశారు. వేలాది వజ్రాలతో అందంగా అలంకరించి ఉన్న ఈ విమానం ఫొటోను ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌ సంస్థ తన ట్విటర్‌లో పోస్టు చేసింది. విమానాశ్రయంలో వజ్రాలతో మెరిసిపోతున్న ఎమిరేట్స్‌ ‘బ్లింగ్‌’ 777 విమానం ఇది అంటూ ఆ సంస్థ పేర్కొంది. అయితే ఈ చిత్రాన్ని చూసిన వారు.. ‘వజ్రాల విమానం’.. ‘ఇది సాధ్యమేనా’ అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.  అయితే ఎమిరేట్స్‌ పోస్టులోనే వారి ప్రశ్నలకు సమాధానం కూడా ఉంది. సారా షకీల్‌ అనే కళాకారిణి రూపొందించిన చిత్రం ఇది అని ఆ ఫొటో కింద రాసి ఉంది. అయితే చాలా మంది ఆ విషయాన్ని గమనించకపోవడంతో ఈ ఫొటో కాస్త వైరల్‌గా మారింది. ప్రముఖ క్రిస్టల్‌ ఆర్టిస్ట్‌ అయిన సారా షకీల్‌.. ఈ అద్భుత చిత్రాన్ని రూపొందించగా.. అది ఎమిరేట్స్‌ సంస్థను ఆకర్షించింది. వెంటనే ఆమె అనుమతితో ఈ ఫొటోను రీపోస్టు చేసింది ఆ సంస్థ. ‘ఆమె సృష్టించిన ఈ కళాఖండాన్ని మాత్రమే మేం పోస్టు చేశాం. ఇది నిజం కాదు’ అంటూ ఎమిరేట్స్‌ ప్రతినిధి ఒకరు మీడియాకు స్పష్టం చేశారు.