ప్రజా ప్రయోజన వాజ్యం లో జైట్లీ కి ఊరట…..లాయర్ కు జరిమానా!

వాస్తవం ప్రతినిధి: రిజర్వు బ్యాంకులో నిధుల నిల్వలకు సంబందించిన వాజ్యం విషయం లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రిజర్వు బ్యాంకులో నిధుల నిల్వలకు సంబంధించి ఆయనపై ఇటీవల ఆరోపణలు చేస్తూ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. అయితే ఈ   వ్యాజ్యాన్ని తాజాగా అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. అంతేకాకుండా ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన న్యాయవాది ఎం.ఎల్.‌ శర్మకు కోర్టు రూ.50వేల జరిమానా కూడా విధించడం గమనార్హం. ఈ వ్యాజ్యం విచారణకు తీసుకునేందుకు తమకు ఎలాంటి కారణం కనిపించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. ఆర్బీఐలో నగదు నిల్వలను ఆర్థిక మంత్రి జైట్లీ దోచుకున్నారని ఆరోపిస్తూ శర్మ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా కోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించి రూ.50వేల జరిమానా విధించింది. అలాగే ఆయన జరిమానా కట్టేవరకు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయడానికి వీల్లేదని ఆదేశించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టేస్తున్నట్లు కోర్టు వెల్లడించిన తర్వాత కూడా ఆయన వాదిస్తూనే ఉండడంతో కోర్టు ఆగ్రహించి జరిమానా విధించినట్లు తెలుస్తుంది.