బులందర్ శహర్ అల్లర్ల కేసులో మరో కీలక మలుపు!

వాస్తవం ప్రతినిధి: ఉత్తర్‌ప్రదేశ్‌లో బులంద్‌శహర్‌లో చెలరేగిన అల్లర్ల కేసులో మరో కీలక మలుపు తిరిగింది.  ప్రాణాలు కోల్పోయిన ఇన్‌స్పెక్టర్‌ సుబోధ్‌కుమార్‌ సింగ్‌ పై ప్రధాన నిందితుడు యోగేశ్ రాజ్ కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానించారు. అయితే ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.  తాజాగా.. జమ్మూ కాశ్మీర్ కు చెందిన జవాను జీతు ఫ్యూజి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మారాడు. శ్రీనగర్‌కు చెందిన జీతు ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఘటన జరిగిన రోజు సాయంత్రమే జీతు శ్రీనగర్‌ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

బులందశహర్‌ ఘటనలకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోల్లో జీతు స్పష్టంగా కనిపించాడు. అతడిని పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు జమ్ముకశ్మీర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సుబోధ్‌ హత్య వెనుక కుట్ర కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అల్లర్ల సమయంలో సుబోధ్‌ను చంపేయ్యండి అంటూ కొందరు ఆందోళనకారులు అరుస్తున్న వీడియో ఒకటి తాజాగా బయటకొచ్చింది. ఈ ఘర్షణలో మరో యువకుడు సుమిత్‌ కూడా చనిపోయాడు. సుమిత్‌ మృతికి ప్రతీకారంగానే సుబోధ్‌పై దాడి చేసినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. పదునైన ఆయుధంతో సుబోధ్‌పై దాడి చేసి ఆ తర్వాత తలపై కాల్చి చంపినట్లు తెలుస్తుంది. సుబోధ్‌ చనిపోయిన సమయంలో జీతు అతని ఎదురుగానే ఉన్నట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. ఈ క్రమంలో అతడిని అదుపులోకి తీసుకోవాలని ప్లీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే జీతు తల్లి మాత్రం తన కొడుకు పోలీస్‌ను హత్య చేశాడంటే నమ్మలేనని, ఒకవేళ నిజంగానే ఇన్‌స్పెక్టర్‌ను జీతు హత్య చేసి ఉంటే.. అతడిని శిక్షించాలని’ ఆమె అన్నారు.