వాస్తవం ప్రతినిధి: బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు పార్లమెంటులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇయు నుంచి బ్రిటన్ నిష్క్రమణ ప్రక్రియపై పార్లమెంటు మరింత పట్టు బిగించింది. బ్రెగ్జిట్‌కు సంబంధించి థెరిసా మే ప్రణాళికపై వచ్చే మంగళవారం కీలక ఓటింగ్ జరగనున్న తరుణంలో ఆమెపై పార్లమెంటు ధిక్కార తీర్మానం అమోదం పొందడం గమనార్హం. బ్రెగ్జిట్‌పై న్యాయ శాఖ సలహాను పూర్తిగా కాకుండా సారాంశాన్ని మాత్రమే ఇవ్వడంపై పార్టీలకతీతంగా పార్లమెంటు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇది పార్లమెంటు ప్రాధాన్యతను తగ్గించడమేనంటూ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఈ మేరకు ఒక తీర్మానాన్ని తీసుకొచ్చారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 311 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 293 ఓట్లు వచ్చాయి. లేబర్ పార్టీ, గ్రీస్స్, స్కాటిష్ నేషనల్ పార్టీ, ప్లెయిడ్, సిమ్రూ, ఉత్తర ఐర్లండ్‌కు చెందిన డెమొక్రటిక్ యూనియన్, టోరి పార్టీకి చెందిన కొందరు ఎంపీలు తీర్మానానికి అనుకూలంగా ఓటు చేశారు. వీరి మధ్య కుదిరిన ఈ అసాధారణ రాజకీయ ఐక్యత ప్రదర్శించడం ద్వారా థెరిసాకు గట్టి షాక్ ఇచ్చారు. ఇది ప్రతిపక్షాల విజయం. డిసెంబరు 11న తుది ఓటింగ్ జరగనుంది. దీంట్లో ప్రభుత్వం పరాజయం పాలవుతుందని భావిస్తున్నారు.