సౌదీ జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గి హత్యకేసులో అరెస్ట్ కు వారెంట్లు జారీ చేయాలని కోరిన టర్కీ న్యాయవాది

వాస్తవం ప్రతినిధి: సౌదీ జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గి హత్యకేసులో ఇద్దరు కుట్రదారుల అరెస్టుకు వారెంట్లు జారీ చేయాలని టర్కీ న్యాయవాది డిమాండ్‌ చేశారు. అక్టోబర్ 2 న వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి టర్కీ లోని సౌదీ కాన్సులేట్ లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు సన్నిహితులైన ఉన్నతాధికారులు సౌద్‌ అల్‌ ఖతాని, మాజీ డిప్యూటీ ఇంటెలిజెన్స్‌ అధిపతి అహ్మద్‌ అసిరిలను అరెస్టు చేసేందుకు వారంట్లు ఇవ్వాలని టర్కీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం కోర్టును కోరినట్లు దర్యాప్తు అధికారులకు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఖషోగి హత్యకు కుట్ర పన్నింది వీరిద్దరే అని బలంగా నమ్ముతున్నట్లు చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సిఐఎతో ప్రైవేటుగా జరిగిన సమావేశంలో అమెరికా సెనెటర్లు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఖషోగి హత్యకు ఆదేశాలు జారీ చేసింది సౌదీ యువరాజేనని ఇంతకుముందే సిఐఎ నిర్ధారించింది. దీనిపై అమెరికన్‌ సీనియర్‌ సెనేటర్లు ట్రంప్‌ ప్రభుత్వాన్ని మంగళవారం నాడు సభలో గట్టిగా నిలదీశారు. అయితే, అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం అమెరికా-సౌదీ సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.