సిరిసేన పై విక్రమ సింఘే తీవ్ర వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: శ్రీలంక ప్రధాని పదవి నుండి తొలగించబడిన రాణిల్‌ విక్రమసింఘె దేశాధ్యక్షుడు సిరిసేనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విక్రమ సింఘే ను ప్రధాని పదవి నుంచి తొలగిస్తూ,రాజపక్స ను ప్రధాని గా నియమిస్తూ సిరిసేన సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సిరిసేన నిర్ణయం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడం అలానే అక్కడి కోర్టు ను ఆశ్రయించడం తో రాజపక్స నియామకాన్ని కోర్టు ఖండించింది. ఆయనను వెంటనే ప్రధాని పదవి నుంచి తప్పించాలని కోర్టు స్పష్టం చేసింది. అక్టోబరులో తనను తొలగించినప్పటికీ ప్రధానమంత్రి అధికార నివాసాన్ని ఖాళీ చేసేందుకు తిరస్కరిస్తున్న విక్రమసింఘె మంగళవారం ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను హిట్లర్‌తో పోల్చుతూ, రాజ్యాంగాన్ని తోసిరాజన్న నియంత హిట్లర్‌ మాదిరిగా వ్యవహరించవద్దని సూచించారు. అలా చేయడానికి ఆయనను ఎంత మాత్రమూ అనుమతించబోమని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో తనకు పూర్తి మెజారిటీ వున్నందున అధ్యక్షుడు తనను ప్రధానిగా నియమించాల్సిందేనని చెబుతున్నారు. తొలగించినప్పటికీ విక్రమసింఘె మద్దతుదారులు పార్లమెంట్‌లో మెజారిటీ వుందని చెబుతున్నారు. కాగా అధ్యక్షుడు నియమించిన రాజపక్సా విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. అయితే రాజపక్సా తన చట్టబద్ధతను రుజువు చేసుకునేందుకు ఈ నెల 12 వరకు గడువు వుంది. ఒకవేళ విక్రమసింఘెకు 225 మంది సభ్యుల మద్దతు వున్నా ఆయన్ని తిరిగి నియమించేది లేదని సిరిసేన స్పష్టం చేశారు.