ఆమె వ్యాఖ్యలు కోచ్ పాత్రను ఎక్కువ చేసి చూపించడమే: మంజ్రేకర్

వాస్తవం ప్రతినిధి: భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌గా రమేశ్‌ పొవార్‌నే కొనసాగించాలంటూ ఇటీవల టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన బీసీసీఐకి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఐతే దీనికి సంబంధించిన ఈమెయిల్లో పొవార్‌ను ఆకాశానికి ఎత్తేశారు హర్మన్‌, స్మృతి. పొవార్‌ రాకతో భారత జట్టు ముఖచిత్రమే మారిపోయిందని, అమ్మాయిల ప్రదర్శనను అతనెంతగానో మెరుగు పరిచాడని.. పొవార్‌ స్థానంలో మరొకరు వస్తే మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాల్సి వస్తుందని బోర్డుకు పంపిన మెయిల్లో వారు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ లేఖ పై   మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ‘‘పొవార్‌ కోచ్‌ కాకముందే గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరిందని, దాదాపు కప్‌ గెలిచినట్లే కనిపించింది అని హార్మన్ అది గుర్తు చేసుకుంటే మంచిది అని వ్యంగ్యాస్త్రాలు చేశారు. పొవార్‌ను తప్పిస్తే మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుందన్న ఆమె వ్యాఖ్య కోచ్‌ పాత్రను ఎక్కువ చేసి చూపించడమే అని మంజ్రేకర్‌ ట్విటర్లో పేర్కొన్నారు. ఇటీవల టీ-20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో మిథాలీ ని పక్కన పెట్టడం తో కోచ్ రమేష్ పొవార్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే.