ముగిసిన సీబీఐ వివాదం సుప్రీం వాదనలు…. రిజర్వ్ లో తీర్పు!

వాస్తవం ప్రతినిధి: అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ లో నెలకొన్న వివాదం నేపథ్యంలో తనను అకారణంగా ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ చీఫ్‌ అలోక్ వర్మ , ఎన్జీవో కామన్‌ కాజ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. అయితే వాదనలు విన్న కోర్టు ఈ కేసులో తీర్పును రిజర్వ్‌ చేసినట్లు పేర్కొంది. సర్వోన్నత న్యాయస్ధానంలో ఈ కేసుపై గురువారం వాదనలు వినిపించిన కామన్‌ కాజ్‌ తరపు న్యాయవాది దుష్యంత్‌ దవే.. సీబీఐ చీఫ్‌గా వర్మ అధికారాలను కేంద్ర కత్తిరించడాన్ని తప్పుపట్టారు. సీబీఐ డైరెక్టర్‌ పదవి నిర్ణీత పదవీకాలంతో కూడుకుని ఉన్నందున దీనికి అఖిల బారత సర్వీస్‌ నిబంధనలు వర్తించవని కోర్టుకు నివేదించారు. అయితే అనూహ్య, అసాధారణ సందర్భాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ జోక్యం అనివార్యమైందని విజిలెన్స్‌ కమిషన్‌ తరపు న్యాయవాది సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొన్నారు. అయితే సెలక్షన్‌ కమిటీని సంప్రదించకుండానే సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ అధికారాలను కత్తిరించే అవసరం ఎందుకొచ్చిందని కోర్టు విజిలెన్స్‌ కమిషన్‌ను ప్రశ్నించింది. సీబీఐ ఉన్నతాధికారులు వర్మ, ఆస్ధానాల మధ్య రాత్రికి రాత్రే వివాదం చెలరేగలేదని పేర్కొంది.