మిషెల్ కు ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీ

వాస్తవం ప్రతినిధి: అగస్టావెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల ఒప్పందంలో మధ్యవర్తి క్రిస్టియన్‌ మిషెల్‌కు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఢిల్లీ కోర్టు లో ప్రవేశపెట్టగా ఢిల్లీ కోర్టు ఐదు రోజుల సీబీఐ కస్టడీ విధించినట్లు తెలుస్తుంది. రూ.3,600 కోట్ల విలువైన అగస్టావెస్ట్‌ల్యాండ్‌ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన బ్రిటన్‌ జాతీయుడు మిషెల్‌ను యూఏఈ భారత్‌కు అప్పగించగా, మంగళవారం రాత్రి దుబాయి నుంచి ఢిల్లీ కి తీసుకువచ్చారు. వెంటనే అదుపులోకి తీసుకున్న సీబీఐ.. బుధవారం ప్రత్యేక కోర్టు జడ్జి అరవింద్‌ కుమార్‌ ఎదుట హాజరుపరచగా,14 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరింది. ఆధారాలతో ప్రశ్నించి ఈ వ్యవహారంలో డబ్బు లావాదేవీల్ని వెలికి తీయాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. ఐదురోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించిన కోర్టు.. తిరిగి ఈనెల 10న హాజరుపర్చాలని తెలిపింది. కేసుకు సంబంధించిన అభియోగపత్రంతో పాటు అన్ని రకాల పత్రాలను మిషెల్‌కు అందించాలని జడ్జి ఆదేశించారు.