తెలంగాణ లో ఎవరికి ఓటు వేయాలో సూచించిన జనసేనాని

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ఎన్నికల సందర్భంగా తమ అభిప్రాయం చెప్పమని అందరూ అడుగుతున్నారని.. ఈ విషయం ఎన్నికల ప్రచారం చివరి రోజైన డిసెంబరు 5న వెల్లడిస్తానని పవన్ ట్విట్టర్లో రెండు రోజుల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే.అన్న ప్రకారమే బుధవారం పవన్ రెండు నిమిషాల వీడియో సందేశం ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ దాశరథి రాసిన గేయాన్ని ఉటంకిస్తూ మొదలుపెట్టిన పవన్.. అనేక ఒడిదుడుకుల మధ్య తెలంగాణ యువత పోరాడి సరికొత్త రాష్ట్రాన్ని సాధించుకుందని.. తెలంగాణ అంటే తనకు సంపూర్ణమైన గౌరవముందని చెప్పాడు.

ఇక్కడి పోరాట స్ఫూర్తిని, త్యాగాలను సంపూర్ణంగా అర్ధం చేసుకున్నాను కాబట్టే తెలంగాణ అంటే అంత గౌరవమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియచేశారు. ముందస్తు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో తక్కువ సమయాభావం, ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయలేకపోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికలలో పారదర్శకత వున్న వారికి ఓటేయాలంటూ పిలుపు నిచ్చారు. ఎవరైతే నిజాయితీగా ఉంటూ పాలన అందిస్తారో వారికే ఓటేయాలని తెలిపారు. తక్కువ అవినీతి – ఎక్కువ పారదర్శకత ఉన్నవాళ్లకే ఓటేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.