నేను.. నా ఇంటికి బయలుదేరా. ఈ భావనను మాటల్లో చెప్పలేను : సోనాలి

వాస్తవం సినిమా: గత కొంతకాలంగా బాలీవుడ్ నటి సోనాలి బింద్రే క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే.న్యూయార్క్ లో ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో ఆమెను అనేకమంది బాలీవుడ్ నటులు, స్నేహితులు వచ్చి ఆప్యాయంగా పలకరించారు. ఎంత కష్టం వచ్చినా చిరునవ్వును మాత్రం కోల్పోలేదు సోనాలి. ప్రస్తుతం చాలా వరకు కోలుకున్న సోనాలి ట్రీట్మెంట్ ముగించుకొని ఇండియా వచ్చింది. ఈ సందర్బంగా సోనాలి ముంబైకి తిరిగి వస్తున్నట్టు ట్వీట్ చేసింది. క్యాన్సర్‌పై తన పోరాటం ఇంకా పూర్తి కాలేదని తెలిపారు.

‘‘దూరం ప్రేమను పెంచుతుందంటారు. నిజమే.. కానీ అది మీకు నేర్పిన పాఠాన్ని మాత్రం తక్కువ అంచనా వేయొద్దు. న్యూయార్క్‌లో ఉన్నప్పుడు చాలా కథలు చదివా. ఒక్కొక్కరు వారి కథను వివిధ రకాలుగా వర్ణించారు. ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించడానికి చాలా కష్టపడతారు.. కానీ లక్ష్యాన్ని మాత్రం వదిలేయరు.

ఇప్పుడు నేను.. నా ఇంటికి బయలుదేరా. ఈ భావనను మాటల్లో చెప్పలేను. కానీ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా. నా కుటుంబాన్ని, స్నేహితుల్ని మళ్లీ చూస్తున్నాననే ఆనందంలో ఉన్నా. ఇంకా క్యాన్సర్‌పై నా పోరాటం పూర్తి కాలేదు. కానీ ఇలా చిన్న విరామం తీసుకుని రావడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ సోనాలి తన ఫొటోల్ని షేర్‌ చేశారు.