కెనడా,మెక్సికో లతో అమెరికా నూతన వాణిజ్య ఒప్పందం

వాస్తవం ప్రతినిధి: కెనడా, మెక్సికోలతో అమెరికా నూతన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. అర్జెంటీనా లో జరుగుతున్న  జి – 20 సదస్సు సందర్భంగా ఈ ఒప్పందంపై మూడు దేశాలు సంతకాలు చేశాయి. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా) స్థానే ఈ కొత్త త్రైపాక్షిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ కొత్త ఒప్పందం వల్ల అన్నిపక్షాలు ప్రయోజనం పొందుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు వున్న వాటిల్లో బహుశా ఇదే అతిపెద్ద వాణిజ్య ఒప్పందమని అన్నారు. కెనడా ప్రధాని ట్రుడెయు ఈ ఒప్పందాన్ని కొత్త నాఫ్తాగా అభివర్ణించారు. సాధారణంగా వాణిజ్య చర్చల క్రమంలో తలెత్తే తీవ్రమైన ఆర్థిక అనిశ్చితులను తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. మెక్సికో అధ్యక్షుడుగా పదవి నుండి వైదొలగనున్న పెనా నీటో మాట్లాడుతూ, ఈ వాణిజ్య ఒప్పందంలో వాణిజ్యానికి, సమాచార సాంకేతికతకు సంబంధించిన నిబంధనలు వున్నాయని అన్నారు. మరోపక్క అక్రమ వలసలను నిలువరించాల్సిందిగా మెక్సికోను ట్రంప్‌ కోరినట్లు తెలుస్తుంది. కొత్త నాఫ్తా ఒప్పందానికి ఇదొక షరతని పేర్కొన్నారు.