జీ-20 సదస్సు లో ట్రంప్, పుతిన్ ల భేటీ

వాస్తవం ప్రతినిధి: అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సదస్సు నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భేటీ కానున్నారని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిట్రీ పెక్సోవ్‌ ప్రకటించారు. ఇరువురు దేశాధినేతలూ ముందు కొద్దిసేపు పరస్పరం భేటీ అవుతారని, తరువాత ఇరుదేశాల ప్రతినిధి వర్గాలతో విస్తృత చర్చల్లో పాల్గొంటారని, ఈ చర్చలు దాదాపు గంటసేపు జరిగే అవకాశాలున్నాయని ఆయన వివరించారు. ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భద్రత, నిరాయుధీకరణ, ప్రాంతీయ ఘర్షణల వంటి అంశాలపై పుతిన్‌, ట్రంప్‌ చర్చించనున్నారని ఆయన తెలిపారు. ఈ సదస్సులో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ కూడా గురువారం అర్జెంటీనా చేరుకున్న సంగతి తెలిసిందే.