భువి ని తీసుకుంటే ఆశర్యమే: మంజ్రేకర్

వాస్తవం ప్రతినిధి: మరో ఆరో రోజులలో టీమిండియా-ఆసీస్‌ల మధ్య అసలుసిసలైన సమరం మొదలవ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోసం  టీమిండియా-కంగారూ జట్టుతో వార్మప్‌ మ్యాచ్‌లు కూడా మొదలు పెట్టేసింది. అయితే తొలి టెస్టులో జట్టు ఎంపికపై ఇప్పటికే పలువురు సీనియర్‌ క్రికెటర్లు తమ అభిప్రాయాలను బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకి మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్‌ కూడా చేరిపోయారు. తొలి టెస్ట్‌కు ఆడబోయే జట్టులో టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను తీసుకుంటే తానెంతో ఆశ్చర్యానికి గురవుతానని ఆయన అన్నారు.  ‘తొలి టెస్టులో ఆసీస్‌తో తలపడే టీమిండియా జట్టులో నా జాబితా ప్రకారం భువనేశ్వర్‌ లేడు. ఎందుకంటే ఈ టెస్టుకు అతడికి విరామం ఇవ్వడం మంచిది. భువీ ఫిట్‌నెస్‌ పరంగా చూస్తే తొలి టెస్టు కంటే రెండో టెస్టుకు తీసుకోవడం మంచిది. ఇక ఇషాంత్‌ విషయానికొస్తే అతడు ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ల్లో కాస్త స్థిరంగానే ఆడాడు. కాబట్టి అతడిని తొలి టెస్టులో ఎంపిక చేసుకోవచ్చు. జస్ప్రీత్‌ బుమ్రా బ్యాట్స్‌మెన్‌పై దాడి చేస్తాడు. షమీ ఇంగ్లాండ్‌లో బాగానే ఆడాడు. కాబట్టి వీరి ముగ్గురిలో ఎవరినైనా తొలి టెస్టులో ఎంపిక చేయవచ్చు. కానీ వీళ్లతో పోల్చుకుంటే భువనేశ్వర్‌ ఫిట్‌నెస్‌ విషయంలో కాస్త మెరుగు పడాలి. కాబట్టి అతడిని రెండో టెస్టుకు ఎంపిక చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా తొలి టెస్టులోనే భువీని ఎంపిక చేస్తే మాత్రం అది ఆశ్చర్యపడాల్సిన విషయమే’ అని మంజ్రేకర్ అన్నారు.