సీఈసీ గా సునీల్ అరోరా

వాస్తవం ప్రతినిధి: భారత ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన కమిషనర్ (సీఈసీ)గా సునీల్ అరోరా(62) నియమితులైనట్లు తెలుస్తుంది.  అరోరా నియామానికి సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ప్రస్తుతం దేశ ఎన్నికల ప్రధానాధికారిగా ఓపీ రావత్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే  డిసెంబర్ 2 తో ఆయన పదవీ కాలం ముగియనుండడం తో రావత్ నుంచి సునీల్ అరోరా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2017, సెప్టెంబర్‌లో ఎన్నికల కమిషనర్(ఈసీ)గా అరోరా నియమితులయ్యారు. 1980వ ఐఏఎస్ బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన అరోరా ఆర్థికశాఖ, టెక్స్‌టైల్స్ మంత్రిత్వశాఖల్లో, ప్రణాళిక సంఘంలో పలు కీలక పదవులు నిర్వహించారు. సమాచార, నైఫుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వశాఖల్లోనూ కార్యదర్శిగా సేవలందించారు. 1999-2002వరకు పౌర విమానయాన శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు కూడా. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు ఐదేండ్లపాటు సీఎండీగా వ్యవహరించిన ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రికి కార్యదర్శిగా(1993-98), ప్రిన్సిపల్ సెక్రటరీగా(2005-08) విధులు చేపట్టారు.