బుకారిని హత్య చేసిన ఉగ్రవాది హతం

వాస్తవం ప్రతినిధి: కాశ్మీర్ జర్న‌లిస్టు సుజాత్ బుకారిని హ‌త్య చేసిన ఉగ్ర‌వాది ఆజాద్ అహ్మ‌ద్ మాలిక్ హతమొందినట్లు తెలుస్తుంది. ఈ రోజు జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఆ ఉగ్రవాది చ‌నిపోయాడు. రైజింగ్ కాశ్మీర్ ప‌త్రిక న‌డిపిస్తున్న స‌జాత్ బుకారిని జూలై నెల‌లో త‌న ఆఫీసు ముందే కాల్చి చంపేసిన సంగతి తెలిసిందే. అయితే బుకారిని హ‌త్య చేసిన వారిలో ల‌ష్క‌రే ఉగ్ర‌వాదులు కూడా ఉన్నారు. అయితే ఈ రోజు జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఆరుగురు ల‌ష్క‌రే ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌వ్వగా, ఆ ఉగ్ర‌వాదుల్లో ఆజాద్ అహ్మ‌ద్ మాలిక్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అనంత‌నాగ్ జిల్లాకు చెందిన అతన్ని ఆజాద్ దాదా అని కూడా పిలుస్తారు. షేకిపురా ఏరియాలో రాష్ట్రీయ రైఫిల్స్‌తో పాటు స్థానిక పోలీసులు ఆప‌రేష‌న్ నిర్వ‌హించగా, ఆరుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.  అయితే ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ప్రాణాలు కోల్పోయిన ఉగ్ర‌వాదుల్లో ఉనైస్ షాఫి, షాహిద్ బాసిర్‌, బాసిత్ ఇస్తియాక్‌, అకిబ్ న‌జ‌ర్‌, ఫిర్‌దౌస్ న‌జ‌ర్ ఉన్నట్లు సమాచారం.