ఆరు నెలలలోగా జమ్మూ లో ఎన్నికలు: సీఈసీ

వాస్తవం ప్రతినిధి: జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్ర అసెంబ్లీని  గవర్నర్ సత్య మాలిక్ రద్దు చేస్తూ బుధవారం కీలక నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఆరు నెలల్లోగా ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) ఒ.పి.రావత్‌ తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందే కశ్మీర్‌ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశాలను ఆయన తోసిపుచ్చలేదు. ‘మే నెలలోగానే కశ్మీర్‌లో ఎన్నికలు జరిగి తీరాలి. పార్లమెంటు ఎన్నికల కంటే ముందు కూడా అవి జరగవచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక చట్టసభ రద్దయిన ఆరు నెలల్లోగా ఎన్నికలు జరగాలి. అన్ని అంశాలనూ పరిగణనలో తీసుకున్నాక ఈసీ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది’ అని రావత్ తెలిపారు.