జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన నిర్ణయం

వాస్తవం ప్రతినిధి: జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులుగా అక్కడ నెలకొన్ని రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆయన రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పీడీపీ, కాంగ్రెస్, ఎన్సీ ప్రయత్నిస్తుండగానే.. గవర్నర్ అసెంబ్లీని రద్దు చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది.

ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో గవర్నర్ పాలన కొనసాగుతోంది. పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగినప్పటి నుంచి అంటే ఈ ఏడాది జూన్ నుంచి అక్కడ గవర్నర్ పాలన కొనసాగుతోంది. అప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. గవర్నర్ తాజా నిర్ణయంతో డిసెంబరు 18 తర్వాత జమ్ముకశ్మీర్ కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోనుంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నిలతోపాటు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. కాగా, భయంతోనే బీజేపీ ఈ అసెంబ్లీని రద్దు చేయించిందని, ఇది కాకతాళీయంగా తీసుకున్న నిర్ణయం కాదని కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.