శరణార్ధులు,నిరుపేదల ఇబ్బందుల పట్ల ప్రపంచ దేశాలు దృష్టి సారించాలి: పోప్

వాస్తవం ప్రతినిధి: శరణార్ధులు,నిరుపేదల ఇబ్బందుల పట్ల ప్రపంచ దేశాలు దృష్టి సారించాలని పోప్ ఫ్రాన్సిస్‌ కోరారు.  ప్రపంచంలో అసమానతలు పెరుగుతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న అటువంటి వారిని అలక్ష్యం చేయరాదని,దారిద్య్రానికి అన్యాయమే ప్రధాన కారణమని’ ఆయన వ్యాఖ్యానించారు. నిరుపేదల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఇక్కడ రోమన్‌ కేథలిక్‌ చర్చిలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన, రోజు రోజుకు నిరుపేదల ఆకలి కేకలు పెరుగుతున్నాయని, కానీ వాటిని ఆలకించే నాథుడు కరువయ్యారని పోప్ అభిప్రాయపడ్డారు. మరోవైపు సంపన్నులు నానాటికీ ఇంకా అభివృద్ధి చెందుతున్నారని ఆయన అన్నారు. అలానే శరణార్ధులకు తన పూర్తి మద్దతు వుంటుందని ఆయన పునరుద్ఘాటిస్తూ, భవిష్యత్‌ భయంతో వున్న ఊరును, ఇంటిని వదిలి సుదూర తీరాలకు వలస వెళుతున్న వారి పట్ల మనందరం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా వుందని పిలుపు నిచ్చారు. వందలమందికి పైగా సెంట్రల్‌ అమెరికన్‌ దేశాల శరణార్ధులతో కూడిన బృందాలను అమెరికా, మెక్సికో సరిహద్దు వద్ద నిలిపివేసిన నేపథ్యంలో పోప్‌ వ్యాఖ్యలు వెలువడడం గమనార్హం.