వరవరరావుకు ఈ నెల 26 వరకు పోలీస్ కస్టడీ

వాస్తవం ప్రతినిధి: సుప్రీంకోర్టు విధించిన గృహనిర్బంధం ఈ నెల 15న ముగిసిన నేపథ్యంలో శనివారం పూణె పోలీసులు హైదరాబాద్‌లో ని ఆయన నివాసంలో వరవరరావును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ట్రాన్సిట్ వారెంట్ తో వచ్చి వరవర రావుని అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..
ఈ నెల 26 వరకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ పూణెలోని జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. మావోయిస్టు అగ్రనేత గణపతి రహస్య స్థావరాలతోపాటు మావోల లేఖల్లో ఉన్న కోడ్‌భాష గురించి విచారించేందుకు వరవరరావును పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరారు. వాదనలు విన్న కోర్టు 9 రోజులపాటు వరవరరావును పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో వరవరరావు ఇది వరకే ఓసారి అరెస్టైన సంగతి తెలిసిందే.