కోడి కత్తి నాటకం త్వరలోనే బయటపడుతుంది: దేవినేని

వాస్తవం ప్రతినిధి: జగన్ కోడి కత్తి దాడి నాటకం త్వరలోనే బయటపడుతుంది అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వ్యాఖ్యానించారు.  క‌త్తిదాడి జ‌రిగిన 23 రోజుల త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ దీనిపై మాట్లాడ‌టంలో ఆంత‌ర్య‌మేంట‌ని దేవినేని ఉమా ప్ర‌శ్నించారు. ఘటన జరిగిన ఇన్ని రోజుల తర్వాత వైకాపా అధినేత జగన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలో మంత్రి ఉమ మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర పన్నారంటూ ముఖ్యమంత్రిని, డీజీపీని జగన్‌ ముద్దాయిలుగా పేర్కొనడం సరికాదని,జగన్ కేసు విషయంలో పోలీసు విచారణ సక్రమంగానే జరుగుతోందని దేవినేని అన్నారు. దాడి జరిగిన వెంటనే జగన్‌ పోలీసులకు సహకరించలేదని..ఇప్పుడు 23 రోజుల తర్వాత థర్డ్‌ పార్టీ విచారణ జరపాలనడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఇప్పటివరకు పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా ఆయన ఇప్పుడు ఆరోపణలు చేయడం తగదు అని దేవినేని అన్నారు. ఇప్పటికైనా రక్తపు మరకలు పడిన చొక్కాను పోలీసులకిచ్చి సహకరించాలని మంత్రి కోరారు. ప్రస్తుతం జగన్ మానసిక వ్యాధితో మాట్లాడుతున్నారని ఆంధ్రా పోలీసులపై జగన్‌కు నమ్మకం లేదని.. బాధ్యతలను విస్మరించి ఆయన మాట్లాడటం మంచిపద్ధతి కాదని దేవినేని విమర్శించారు.