యోగి ఆదిత్య నాథ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న షాజఫర్ వారసులు

వాస్తవం ప్రతినిధి: పేర్ల మార్పిడి పేరుతో యూపీ సి ఎం యోగి ఆదిత్య నాథ్ పలు ప్రాంతాల పేర్లు మార్చేస్తున్న సంగతి తెలిసిందే. అలహాబాద్‌ను ప్రయాగరాజ్, ఫైజాబాద్‌ను అయోధ్యగా మార్చేశారు. అయితే దీనిపై నెటిజన్లు మంచి కామెంట్లు చేస్తున్నారు లెండీ. కానీ భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా చెప్పుకునే 1857 సిపాయీల తిరుగుబాటుకు కేంద్రబిందువుగా నిలిచి తన జీవితాన్నే పణంగా పెట్టిన చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహాదూర్ షాజఫర్ వారసులు కూడా ఈ ధోరణి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన రాజకీయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. పేరుకు చక్రవర్తి వారసులైనా ప్రస్తుతం వారంతా పేదరికంలో మగ్గుతున్నారు. అలహాబాద్, ముఘల్‌సరాయ్ వంటి పేర్లను ఎడాపెడా మార్చడం నేటి రాజకీయాల్లోని పతనావస్థను సూచిస్తున్నదని షాజఫర్ ముని-ముని-మనుమరాలు జీనత్‌మహల్ షేఖ్ (38) టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చక్రవర్తి ముమనమడైన మీర్జా మహమ్మద్ బేడర్‌బఖ్త్ ఐదుగురు కూతుళ్లలో ఆమె ఒకరు. ఇక బేడర్‌బఖ్త్ భార్య సుల్తానా బేగం (65) కోల్‌కతాలో శేష జీవితాన్ని గడుపుతున్నారు. ప్రభుత్వం నెలకు రూ.6000 పెన్షన్ మంజూరు చేసేంవతరకు ఆమె చాయ్‌వాలాగా జీవితం కొనసాగించేది.