ఏపీ సర్కారును అనుసరిస్తున్న బెంగాల్ ప్రభుత్వం

వాస్తవం ప్రతినిధి: సీబీఐకి నోఎంట్రీ బోర్డు పెట్టేసిన ఏపీ సర్కారును బెంగాల్ ప్రభుత్వం కూడా అనుసరించింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం సెక్షన్6 ప్రకారం.. సీబీఐకి 1989లో తామిచ్చిన ‘సాధారణ సమ్మతి’ వెనక్కు తీసుకుంటున్నట్లు బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది . ఈ నేపధ్యంలో చంద్రబాబుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేశారు. చంద్రబాబు నిర్ణయాన్ని ఆమె ప్రశంసించారు. సీబీఐని మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న తరుణంలో చక్కని నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. తాము కూడా సాధారణ సమ్మతి ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు చంద్రబాబుకు తెలిపారు. మరోవైపు సోమవారం కోల్‌కతా వెళ్లి మమతను కలవనున్న చంద్రబాబు 22న బీజేపీయేతర పార్టీల నేతలతో ఢిల్లీలో సమావేశం కానున్నారు.