డిసెంబర్ 2 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు సిద్దమవుతున్న సీపీఐ రామకృష్ణ

వాస్తవం ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోకపోతే డిసెంబర్ 2 నుంచి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. కడప జిల్లాలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు.

తెలుగుదేశం నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో ఆయన ఆగడాలు మితిమీరుతున్నాయని విమర్శించారు. సాక్షాత్తూ ప్రజాప్రతినిధులు, అధికారులపై చింతమనేని దాడి చేస్తుంటే చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.చింతమనేని ప్రభాకర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని లేదంటే విజయవాడలో ఈ నెల 23న మిగతా వామపక్ష పార్టీలతో కలిసి ఆందోళనకు దిగుతామని స్పష్టం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనలో దోషుల వివరాలను బహిర్గతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.