పట్టపగలు ఆప్ నేత పై హత్యాయత్నానికి పాల్పడ్డ దుండగులు!

వాస్తవం ప్రతినిధి: ఢిల్లీ లో పట్టపగలు కొందరు దుండగులు దారుణానికి ప్రయత్నించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతపై గురువారం సాయంత్రం 20 నుంచి 25 మంది దుండగులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. తుపాకులతో వచ్చిన దుండగులు తన ఇంటిపై దాడి చేశారని కౌన్సిలర్‌ (దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌) జితేందర్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. ఇంటి బయటనున్న కారుపై బుల్లెట్ల వర్షం కురిపించారనీ, ఇంట్లోకి దూరేందుకు యత్నించారని వెల్లడించారు. కొంత సేపటి తర్వాత ‘నీ అంతు చూస్తాం’ అంటూ హెచ్చరించి అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలిపారు.  అయితే వ్యక్తిగతంగా నాకు ఎవరితో విభేదాలు లేవు. ఇది రాజకీయ ప్రత్యర్థులు నాపై చేసిన కుట్ర’ అని జితేందర్‌ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ సి ఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది’ అని అంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. పట్టపగలు సాయుధుల గుంపు ఓ ప్రజా ప్రతినిధిని హత్య చేసేందుకు పూనుకోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.