పూజకు వేళాయెరా

అది కార్తీకమాసం. శివ పూజకు వేళాయెనంటూ భక్తులు తెల్లవారు జామునే శివాలయాలకు పరుగులు తీసే రోజులు. ముఖ్యంగా ఆదివారాల్లో పిక్‌నిక్ లతో సోమవారాల్లో శివుడికి అభిషేకాలతో ఊరంతా సందడిగా ఉండే సీజన్. అలాంటి సందడులతో నిమిత్తం లేకుండా దుప్పటి కప్పుకొని వెచ్చగా పడుకున్నాడు సుబ్బారావు తన ఇంట్లో. అప్పచెప్పిన పనిని నెరవేరుస్తున్న అలారం మ్రోతవిని హడావిడిగా లేచింది అనూరాధ సుబ్బారావు శ్రీమతి. ” ఏమండీ” పిలిచింది భర్తని. ఊహు ఆ పిలుపు సుబ్బారావు చెవినపడలేదు. ఈసారి తట్టి పిలిచింది.’ఊ’ అంటూ అటు నుండి ఇటు వత్తిగిలేడు. కాని లేవలేదు ఇంక లాభం లేదని కుదుపుతూ గట్టిగా అంది “ఏమండీ! గుడికి వెళ్లాలి లేవండీ ” అని.
” ఇప్పుడేం గుడికోయ్ సగం నిద్రలో ” అన్నాడు సుబ్బారావు.
” శివాలయానికండీ. అప్పుడే 4 గం. అయింది. ఇప్పటి నుండీ తయారయితే బయలుదేరి వెళ్లేసరికి 6 గం. అవుతుంది. కనీసం క్యూ మధ్యలోనైనా ఉంటాం”.
” నువ్వెళ్ళి వచ్చేయవోయ్ ” బద్దకంగా వళ్ళు విరుస్తూ అన్నాడు సుబ్బారావు.
” బాగుంది వరస. జన్మానికో శివరాత్రి అన్నట్లు సంవత్సరానికో నెల” అంది అనూరాధ.
” ఆ! నెలకో 4 వారాలు” అందించేడు సుబ్బారావు. అంటే తెలివి వచ్చిందన్న మాట అనుకుంది అనూరాధ.
” వారానికో రోజు అదీ సోమవారం శివదర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం అండీ” నచ్చచెప్పింది భర్తకి.
 “అర్ధాంగివి కదా నీకొచ్చిన పుణ్యంలో సగం నాది కాదంటావా? ” బేరమాడేడు పతిదేవుడు.
” ఆ ! ఎక్కడైనాగాని పుణ్యపాపాలు మాత్రం ఎవరివి వారివే” తేల్చి చెప్పేసింది భార్యామణి.
” అంతేనంటావా?” అన్నాడు సుబ్బారావు.
” అంతే త్వరగా తయారవండి” ఆర్డరు వేసింది అనూరాధ.
” సరేపద “అంటూ లేచేడు సుబ్బారావు.
దంపతులిద్దరూ బయలుదేరి వెళ్ళి గుడిలో క్యూలో నిల్చున్నారు. మిగతా రోజుల్లో వెలవెలపోయే శివాలయం ఇప్పుడు విద్యుద్దీపాలతో కార్తీక దీపాలతో వెలిగిపోతూ కళకళ లాడుతోంది. గర్భగుడి భక్తులు మ్రోగించే గంటలతో, పఠించే స్త్రోత్రాలతో మారు మ్రోగిపోతుంది. వృద్దులు అనకపోయినా యవ్వనం దాటిన వాళ్లంతా శివనామ జపం చేస్తున్నారు. బయటకు వినిపించేలా . ఇంతలో ఒక పెద్ద మనిషి నేరుగా గర్భగుడిలోకి వెళ్ళిపోతుండడం చూసిన సుబ్బారావు అతన్ని ఆపి అక్కడున్న హోంగార్డ్ తో అన్నాడు. ” ఏంటండీ ఆయన క్యూలో రాకుండా అలా లోపలికి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ” అని.
” పైగా టికెట్టు కూడా తీసుకోలేదు ” సుబ్బారావుకి సపోర్టు ఇచ్చేడు క్యూలో ఉన్న మరో ఆయన.
” ఆయనకు టికెట్టూ,క్యూనా ?” అంటూ వేదాంతిలా ఓ నవ్వు నవ్వేడా హోంగార్డ్.
“థ్యాంక్యూ ” అంటూ ఆ పెద్దమనిషి లోపలికి వెళ్ళిపోయేడు.
” ఏమండీ! శివుడి దృష్టిలో అంతా సమానులే అంటారు మరి ?” సందేహం వెలిబుచ్చేడు సుబ్బారావుకు సపోర్టిచ్చినాయన.
“అవునండీ.శివుడి దృష్టిలో సమానులే కాని వీళ్ల దృష్టిలోనే మనకూ ఆయనకూ తేడా ” అనుమాన నివృత్తి చేసేడు సుబ్బారావు. క్యూ ముందుకు జరుగుతుంది. సుబ్బారావు ముందు నిల్చున్న ఆసామీ కదలలేదు. నడవండీ ” వెనకనుండి ఒకరు అరుస్తున్నారు. ఆయన దృష్టి ఎటో ఉంటే క్యూ జరిగిన సంగతి ఆయనకు ఎలా తెలుస్తుంది చెప్పండి?” ఎవరో సమర్దించేరు. ” క్యూలోనే ఉన్నాను. బయటకు వెళ్ళి వచ్చేనని దూరిపోయేవాళ్లు ఒకరూ, వీళ్ళు మావాళ్ళే” అని చొటిచ్చేవాళ్ళు ఇంకొకరూ. ఇలా గొడవలతో క్యూ సాగుతుంది. ఎలాగైతేనేం సుబ్బారావు దంపతులు గర్భగుడిలో ప్రవేశించారు. అక్కడ మరి క్యూలేదు. ఆడా-మగా భేదం లేదు. సుబ్బారావుకు శివుడు కనబడడంలేదు. ముందున్న వాళ్ల శిరస్సులు అడ్డొస్తున్నాయి. పోనీ నంది కొమ్ముల మధ్య నుండి శివుడ్ని చూసినట్లు వాళ్ల శిరస్సుల మధ్య నుండైనా శివుడ్ని దర్శిద్దామని ప్రయత్నించేడు సుబ్బారావు. కాని తీర్ధం ఇచ్చే పూజారి అడ్డు. ఆయన ఇచ్చే తీర్ధం వెనుక నున్న భక్తుల చేతుల్లో కంటే ముందున్న వాళ్ల నెత్తిన పడుతుంది. అంటే భక్తులు శివుడికి అభిషేకం చేయిస్తుంటే పూజారి భక్తులకు అభిషేకం చేయిస్తున్నట్టుంది. ఇంతలో మరో పూజారి  శఠగోపం పట్టుకుని ఒక్కొక్కర్నీ తొందరపెడుతున్నాడు. ఒకాయన దక్షిణ అక్కడున్న హుండీలో వేసేడు. పళ్లెంలో వేస్తాడనుకున్న పూజారి కోపంతో శఠగోపం ఆసామీ నెత్తిన మొట్టికాయ మొట్టీనట్లు పెట్టేడు. దక్షిణ వేస్తేనే గాని శఠగోపం పెట్టేలా లేడని జేబులో నుండి తీసి దక్షిణ వేసేడు. సుబ్బారావు. అంతే అది అందుకొని పూజారి వెళ్లిపోయాడు. ఇంతలో అక్కడున్న హోం గార్డ్ పదండి పదండి. ఒక్కొక్కరూ ఇంతసేపు ఇక్కడ నిల్చుంటే అవతల క్యూ ఎలా కదులుతుందనుకొన్నారు? నడవండి అంటూ త్రోసేస్తున్నాడు అందర్నీ. అందులో సుబ్బారావు ఒకడు. శివుడు కనబడకపోయినా శివుడికిచ్చిన హారతి కళ్లకద్దుకొని బయటపడ్డాడు సుబ్బారావు.
   బయటకు వచ్చేక సుబ్బారావు శ్రీమతి అడిగింది “ఏమండీ దర్శనం బాగా అయిందా? ” అని.
” ఓ! శివదర్శనం కాలేదు కాని సత్యదర్శనం అయింది” అన్నాడు
” అంటే! అంది అనూరాధ
” పద చెప్తాను” అంటూ బయటకు దారితీసేడు సుబ్బారావు.
”  గుడికి వచ్చేక కాస్సేపు కూచోకుండా వెళ్లకూడదట. మా బామ్మ చెప్పింది” అంది అనూరాధ
” మీ బామ్మ గారు క్యూలో నిలబడి కాళ్ళు నొప్పి పుట్టి మరియు నడవలేక అలా చెప్పి ఉంటారు” రహస్యం బయట పెట్టినట్లు చెప్పేడు సుబ్బారావు.
” మీ కన్నీ వేళాకోళాలే” మూతి ముడిచింది ముద్దుగా. అది గుడి అని ‘ ఊరుకున్నాడు సుబ్బారావు. గుళ్ళో   కలిసిన కాసేపట్లోనే బాల్య మిత్రుల్లా కలిసిపోయిన ఓ ఇద్దరు ప్రౌఢ వనితలు సుబ్బారావు దంపతుల ప్రక్కనే కూర్చున్నారు.
 అందులో ఒకావిడ రెండో ఆవిడ్ని అడుగుతుంది.
“ఏమండీ మీరు ఈ వేళ ఉపవాసమేనా?”
“ఆ! కనీసం ఈరోజన్నా ఉపవాసం లేకపోతే మన బ్రతుక్కి అర్ధం ఏముంటుందండీ?”
బ్రతుకు విలువ తెలిసిన తత్వవేత్తలా అంది.
” అయితే కాఫీ, టీ ల లాంటివి కూడా త్రాగరా?” కుతూహలంగా అడిగిందావిడ.
ఈ రోజుల్లో కాఫీ, టీ త్రాగకుండా ఉపవాసం ఎవరుంటున్నారు చెప్పండి,దర్శనం ఎప్పటి కవుతుందో అని కాస్త గొంతులో పోసుకునే వచ్చేను. ఇప్పుడీ దేవుడి ప్రసాదం ఉంది. సాయంకాలం ఎలాగూ భోజనం చేసేస్తాం కదా” ధీమాగా చెప్పింది.
“ఏమోయ్ శ్రీమతి విన్నావా! తమరు కూడా ఈ వేళ ఉపవాసమేనా?” అడిగేడు సుబ్బారావు.
” మరి, ప్రశ్నించింది శ్రీమతి సీరియస్ గా” అయితే రాత్రికి స్పెషల్ మీల్స్ అన్నమాట ” అన్నాడు సంబరపదుతూ.
అదేంటండీ అలా అంటారు?” అంది అనూరాధ
“దాన్ని ఉపవాసం అనరు ” నొక్కి చెప్పేడు సుబ్బారావు
” మరేమంటారు?” అడిగింది తెలియనట్లుగా
” ఉపాహారం అంటారు. అనూ నేనో సంగతి చెప్పనా?”
” చెప్పండి శివాలయంలో కార్తీక పురాణం విన్న పుణ్యమైనా దక్కుతుంది”అంది.
“ఉపవాసం చేయడం వల్ల మన జీర్ణక్రియ చక్కబడుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది. భగవంతుడి పేరుతో మనం చేసే ఉపవాసం భగవంతుడికి సేవ కాదు. మనకు ఆయన  ప్రసాదించే ఆరోగ్యం”.
ఉత్తమ శ్రోతలా శ్రద్దగా వింటుంది అనూరాధ.
” ఉపవాసం ఉండడంలో మరో ఉద్దేశం కూడా ఉంది. ఆకలి బాధ ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుస్తుంది.దేవుడి పేరు చెప్పి ఉపవాసం ఉండమంటే ఉండని వాళ్లు ” ఉపవాసం ఆరోగ్యానికి మంచిది” అని ఏ శాస్త్రజ్ణుడో లేక వైద్య నిపుణుడో స్టేట్ మెంట్ ఇచ్చినట్లు పేపర్లో పడితే తప్పకుండా నమ్ముతారు. అలాగే శివరాత్రినాడు జాగరణ చేయడం శివనామస్మరణ కోసం గాని నిద్ర రాకుండా ఉండడానికి  వేరే మార్గాలు వెతుక్కోవడానికి కాదు. దప్పికతో ఉన్న వాడికి దాహం తీరిస్తే శివుడికి అభిషేకం చేసినట్లే. కడుపు నిండా తిండి దొరికినవాడికి కాక ఆకలితో అలమటించేవాడికి పట్టెడన్నం పెడితే శివుడికి నైవేద్యం  పెట్టినట్లే.  నిజంగా శివుడే ఏ రూపంలోనో వచ్చి మనం పెట్టిన నైవేద్యాన్ని తినేస్తే పెట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారంటావ్?” సుబ్బారావు తన ధోరణిలో చెప్పుకొంటూ పోతున్నాడు. కాని చుట్టుప్రక్కల వాళ్ళు కూడా వింటున్నారన్న సంగతి గమనించలేదు. భార్య చేతిలో ఉన్న ప్రసాదంలో ఓ అరటి పండును అడుక్కునే ఓ ముసలమ్మ చేతిలోనూ, కొబ్బరి చెక్కను ఓ పిల్లవాడి చేతిలోనూ పెట్టేడు. ఆ సమయంలో సుబ్బారావు అనురాధకు గీతాచార్యుడిలా అనిపించేడు. “ఏమండీ మీ గీతోపదేశం అయిందా?” అనడిగింది.
“అయింది కాని నువ్వుమాత్రం అర్జునుడిలా యుద్దం ప్రారంభించకు” అన్నాడు.
” యుద్దానికి కాదు గాని ఇంట్లో పూజకు వేళయింది పదండి వెళ్దాం ” అంటూ లేచింది అనూరాధ.
                                                                                            రచన : మురళీధర శర్మ