దేవీ నవరాత్రుల విశిష్టత

ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు ప్రపంచం లోని హిందువులందరికీ పరమ పవిత్రమైనవి. ఆ తొమ్మిది రోజులు దేవాలయాలలో అమ్మవారిని రోజుకొక్క అవతారంగా అలంకరించి ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పించి పూజిస్తారు.

టెక్నాలజీ అంతగా అభివృద్ది చెందని కాలంలో చాలామందికి ఈ తొమ్మిది అవతారాలు, నైవేద్యాల గురించి అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరిలో వీటన్నిటి గురించి తెలుసనే చెప్పవచ్చు. చాలామంది వారి వారి గృహాలలో కూడా ఏరోజు ప్రత్యేక నైవేధ్యం ఆరోజు అమ్మవారికి ప్రసాదంగా సమర్పించి కొలుస్తున్నారు.
మన శాస్త్రాలలో ఏదైనా చెప్పాలంటే దానికి ఎంతో అర్ధం, పరమార్ధం ఉంటాయని చెప్పనక్కరలేదు. అలాగే అమ్మవారి వస్త్రాలంకరణలు, ప్రత్యేక నైవేద్యాలలో ఎంతో నిగూడార్ధం ఇమిడి ఉన్నది.
శాస్త్ర విజ్ణానాన్ని సామాన్య ప్రజానీకానికి పరిచయం చేయడమే పండుగల పరమార్ధం. వినాయక చవితి ద్వారా ప్రకృతి వైద్యాన్ని మనకు పరిచయం చేసినట్లే, దేవీ నవరాత్రుల ద్వారా మనకు మనస్తత్వ శాస్త్రాన్ని పరిచయం చేశారు.

స్త్రీలను ఆదిశక్తి అవతారంగా భావిస్తారు. ప్రతి స్త్రీలోనూ సందర్భానుసారంగా అమ్మవారి తొమ్మిది అవతారాలలోని లక్షణాలు ప్రస్పుటంగా కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకు మనం స్త్రీలలో అన్నపూర్ణాదేవి లోని అతి ప్రసన్నతను ,దుర్గా దేవి లోని ఉగ్ర స్వరూపాన్ని సందర్భానుసారంగా చూస్తూనే ఉంటాము.

” ఆడది అనుగ్రహిస్తే అమ్మ..ఆగ్రహిస్తే అంబ “

ఇక అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు వాడే వస్త్రాల వర్ణాల విషయం గమనిస్తే ఆ దేవి యొక్క అవతారాలలోని ఆయా గుణాలు ప్రతిబింబించె టట్లుగా ఆ వస్త్రాలంకరణకు వాడే ఆ చీర యొక్క రంగు ఉంటుంది. ఉదాహరణకు దుర్గాదేవి అవతారంగా అమ్మవారికి ఎరుపు రంగు చీరను ధరింపజేస్తే , బాలా త్రిపుర సుందరిగా పసుపురంగు చీరతో అలంకరింపజేస్తారు. ఎరుపు రంగు శక్తిని ప్రతిబిందిస్తే ,పసుపు రంగు సంతోషాన్ని ప్రకటింపజేస్తుంది.

దీనిని బట్టి ఈ వస్త్రాల రంగులు మన మానసిక స్థితి మీద చూపే ప్రభావాన్ని తెలుసుకొని మన దైనందిన జీవితంలో ఉపయోగించుకొంటే మన జీవితాన్ని ఆహ్లాదంగా గడపవచ్చు. ఈ రంగు ధరించే వారి మానసిక స్థితి మీదే కాక చూసే వారి మీద కూడ ప్రభావాన్ని చూపుతుంది.

ఇప్పుడు మనం ఏయే రంగులు ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకొందాం.

నారింజ: స్థిరత్వం
ఎరుపు: శక్తి , గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది. త్వరగా నిర్ణయాలు తీసుకొనేటట్లు చేస్తుంది.(వాలెంటైన్స్ డే రోజు రెడ్ రోజస్ ఎందుకిస్తారో తెలిసింది)

బ్లూ: సంపద, నమ్మకం, ఆకలిని తగ్గిస్తుంది (అమ్మాయిలందరూ ఇక బ్లూ రంగు ధరిస్తారేమో )

పింక్: శృంగారం

తెలుపు: స్వచ్చత , శాంతి, అమాయకత్వం

పసుపుపచ్చ: సంతోషం, తెలివి, ఉల్లాసం

ఆకుపచ్చ: విశ్రాంతి , ప్రకృతి (మనము పచ్చదనాన్ని చుస్తే విశ్రాంతి పొందుతాము కదా.)

పసిడివర్ణం: జ్ణానం , సంపద , వెలుగు

లేత నీలం : స్వస్ధత చేకూరుస్తుంది ( మనము సముద్రాన్ని చూస్తుంటే మనకున్న బాధలన్నీ మరిచిపోయినట్లు)

ఇక నైవేద్యాల విషయానికి వస్తే దేవీ నవరాత్రులు శరదృతువులో జరుపుకుంటాము. వీటిని శరన్నవరాత్రులు అని కూడా అంటారు. ఈ రోజుల్లో వెన్నెల ఎక్కువగా ఉంటుంది. పూర్వపు రోజుల్లో గుళ్ళలోనే అందరు కలిసేవారు. కనుక ఈ నవరాత్రులు వెన్నెల రోజులు కాబట్టి దేవాలయాలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు , ఆటలపోటీలు ఉండేవి. వీటన్నిటికి శక్తి కావాలి కాబట్టి ఆ నైవేద్యాలను నెయ్యి, పాలు, తేనె, పంచదార, పండ్లు, పిండి పదార్దాలతో ఎక్కువగా చేసేవారు . ఇవన్నీ సమపాళ్ళలో తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అంతేకాని పోరపాటున ఒక్క రోజు నివేదించాల్సిన ప్రసాదాన్నిమరొకరోజు చేసినట్లైతే ఏదో ఘోరం జరిగినట్లుగా భావించరాదు. అమ్మవారికి భక్తిశ్రద్దలతో మన శక్తి కొలది ఏది సమర్పిస్తే ఆ తల్లి ఆనందంగా స్వీకరించి మనం కోరిన వరాలను ప్రసాదిస్తుంది . సాంప్రదాయలను పాటించడంతో పాటు వాటిని ఎందుకు పాటించమన్నారో కొంత విశ్లేషాత్మకంగా పరిశీలిస్తే ఈ దేవీ నవరాత్రులు అతివల ఆరోగ్యానికి సోపానాలవుతాయి.

అమ్మలగన్నయమ్మ

అంబరానా చుక్క అమ్మనుదిట బొట్టు
ఆ సూర్య చంద్రులే అందాల కన్నుల్లు
విరజాజి జలుల్లే అమ్మ చిరునవ్వులై
అపూరుపమై వెలుగు అమ్మరూపమ్ము
ఆది అంతనమునేలు ఆమె తేజమ్మ!!

రచన : సమిరా చవాకుల