ఏకాంత

శ్రావ్య ది పేరుకు తగ్గట్టు చక్కటి స్వరం , సన్నగా నాజూగ్గా , చూడగానే బాగుంది అనిపించే అమ్మాయి . మాధవి , రాజేష్ ల ఏకైక సంతానం .

మాధవి రాజేష్ ల ది ప్రేమ వివాహం అందులో పెద్దల ను ఎదిరించి చేసుకున్న వివాహం కావడంతో వాళ్ళిద్దరూ అయిన వాళ్లకు దూరం అయ్యారు. బంధువులందరికి దూరంగా స్వేచ్ఛగా బ్రతికే ప్రయత్నం లో ఇండియా ని వదిలి అమెరికా కు వలస వచ్చి తమ జీవితాన్ని ప్రారంభించారు. సహజంగానే ఒంటరి జీవిత విధానమైన అమెరికా జీవనం లో వాళ్ళిద్దరికీ కావాల్సినంత స్వేచ్చ్ … అంతకు మించి ఒంటరి తనం వాళ్ళ కి లభించింది. వాళ్ళు ఉంటున్న కంమ్యూనిటీ లో ఇండియన్స్ చాలా తక్కువ … అందులో ఒకే ఒక తెలుగు వాళ్ళ కుటుంబం ఉండేది . వాళ్లతో నూ మాధవి రాజేష్ ఎక్కువ గా కలిసే వారు కాదు

అమెరికా కు వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచింది … ఒకరికొకరు గా బ్రతుకుతున్న వారికి తోడుగా మరొకరు,  పాప రూపంలో … తమ వైవాహిక జీవితానికి ఫలితంగా కలిగిన సంతానం శ్రావ్య.. కూతురు పుట్టిన సంతోషంలో స్వంత ఇల్లు కొనుక్కున్నారు మాధవి రాజేష్ లు.

రాజేష్ ది ఓ ఫార్మా కంపెనీలో సీనియర్ అక్కౌంటెంట్ … 9-5 ఉద్యోగం.

మాధవి హౌస్ వైఫ్ . పగలంతా ఇంటి బాధ్యత తో పాటు, శ్రావ్య ని చూసుకుంటూ బిజీగా ఉండేది.  సాయంత్రానికి రాజేష్ కి ఇష్టమైన స్నాక్స్ తో వేడి వేడి టీ తో అతని కోసం ఎదురు చూస్తూ ఉండేది.  రాజేష్ రాగానే ముగ్గురు కలిసి ఆ ఇంటిలో, తమ కే స్వంతమైన ఆ చిన్న ప్రపంచంలో, ఉన్న దానిలో ఆనందంగా గడిపేవారు.

తల్లి మార్గ దర్శకంలో శ్రావ్య చదువు తో పాటు … వ్యక్తిత్వం కూడా అభివృద్ధి చెందింది. స్కూల్ నుండి రాగానే తల్లి కి తండ్రి కి అతుక్కొని ఉండేది శ్రావ్య.  సహజంగా కొంచెం బిడియం ఆపై న తమ కుటుంబ పరిస్థితులు … తల్లి తండ్రి తప్ప శ్రావ్య ఇంకా ఎవరితోనూ కలవకుండా చేసింది.

శ్రావ్య కి తల్లి తండ్రులే తన ప్రపంచం అయితే … మాధవి , రాజేష్ లకు శ్రావ్య నే సర్వస్వం.  స్కూల్ లో తన ను బుల్లీ చేస్తే .. పొర్లు తున్న దుఖాన్ని అదిమి పెట్టుకొని, సాయంత్రం ఇంటికి వచ్చి తల్లి ఒడిలో చేరి భోరున ఏడ్చేది శ్రావ్య. ఇంక స్కూల్ కి వెళ్లనని మొండి కేసి రెండు రోజులు అమ్మని వదల కుండా తిరుగుతూ ఉండేది.

మాధవి ఓపిగ్గా … తన ను ఓదార్చి, నచ్చ చెప్పి, ధైర్యాన్ని నూరి పోసి .. తిరిగి స్కూల్ కి పంపేది.  నెల కు ఒకటి రెండు సార్లు ఇది ఒక రొటీన్ అయ్యింది శ్రావ్య కి.  స్కూల్ లో బుల్లియింగ్ ఆ అమ్మాయిని తల్లి కి మరింత దగ్గర చేసింది. అమ్మ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండ గలిగేది కాదు.

ఇండియా లో మాధవి , రాజేష్ ల బంధువులు , తల్లి తండ్రులు వీళ్ళని పూర్తిగా మర్చిపోయారు. అమెరికా కు వచ్చిన కొత్తల్లో అయిన వారికి దూరమైన బాధ వీళ్లిద్దరికీ ఉండేది.

కానీ కాల క్రమేణా రొటీన్ లైఫ్ లో పడి … వీళ్ళు కూడా ఇండియా ని, తమ వారిని పూర్తి గా మర్చి పోయారు.

సంవత్సరాలు గిర్రున తిరిగాయి … ఇప్పుడు శ్రావ్య హై స్కూల్ పూర్తి చేసుకొని కాలేజ్ లో అడుగు పెట్టిన టీనేజ్ గర్ల్.

టీనేజ్ వచ్చింది కానీ … అమ్మ దగ్గర శ్రావ్య ఇంకా 5 సంవత్సరాల పాపే. ప్రతి విషయానికి అమ్మ ని అడగాల్సిందే … వేసుకొనే డ్రస్ లు , తినే ఆహారం ప్రతీ ఒక్కటి అమ్మ ని అడక్కుండా ఏమీ చేయలేదు శ్రావ్య .

అమ్మ, నాన్న ఓ చిన్ని తల్లి … అదీ వారి కుటుంబం …పెద్ద పెద్ద కోరికలు లేకుండా, చాలా సాధారణంగా, ఉరుకులు పరుగులు లేని ఆనందమయ జీవితం వారిది.

అండర్ గ్రాడ్ లో ఫస్ట్ ఇయర్ పూర్తి అయింది హాలిడేస్ ప్రారంభం అయ్యాయి . సంవత్సరం అంతా కష్టపడి చదివిన తన చిన్ని తల్లి ని తీసుకొని ఈ వీకెండ్ ఎక్కడైనా గడపాలని మాధవి రాజేష్ లు అనుకున్నారు. శ్రావ్య కి అయితే అలాంటి కోరికలు కూడా పెద్దగా ఏమీ లేవు.

అమ్మ నాన్న, తన ఇల్లు అదే స్వర్గం తనకి .

ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించు కోవడానికి మాధవి, రాజేష్ లకు నెల రోజులు పట్టింది. చివరికి నయాగరా వాటర్ ఫాల్స్ అని డిసైడ్ అయ్యి, శ్రావ్య ని అడిగారు.  మీరిద్దరూ ఉంటే … నాకు ఎక్కడైనా ఒక్కటే అంటూ అమ్మ నాన్నల్ని ఫాలో అయింది శ్రావ్య .

రాజేష్ ఆఫీస్ నుండి రాగానే ఓ ఫ్రై డే సాయంత్రం ట్రిప్ కి రెడీ అయ్యారు.  ట్రిప్ కి కావాల్సిన వన్నీ తమ హొండా ఒడిస్సీ లో సర్దుకున్నారు. రెండు రోజుల పాటు కొత్త ప్రదేశం లో ఎంజాయ్ చేస్తామన్న ఆలోచనే వాళ్లకి ఆనందాన్ని ఇస్తుంది.

శ్రావ్య కూడా ఉత్సాహంగా ఉంది. తన లాప్ టాప్, ఛార్జర్ రెడీ చేసుకొని, ట్రిప్ కి కావలసిన డ్రెస్సెస్ ప్యాకింగ్ లో అమ్మకి హెల్ప్ చేసింది. వాటర్ బాటిల్స్ లోడ్ చేస్తున్న నాన్న కి హెల్ప్ చేసింది .

ఒడిస్సి రెడీ చేసుకొని ఈవెనింగ్ 6 కల్లా బయలు దేరారు . వాళ్ళ ఊరి నుండి దాదాపు గా 4 గంటల డ్రైవ్ దూరం లో వుంది నయాగరా వాటర్ ఫాల్స్. రాత్రి కి అక్కడికి చేరుకొని, నేరుగా హోటల్ రూమ్ కి వెళ్లి పోయారు.

***

రెండు రోజులు రెండు క్షణాల్లా గడిచిపోయాయి. నయాగరా సోయగాల ను తనివి తీరా ఆస్వాదించారు . పచ్చటి పచ్చిక బయళ్లు … చుట్టూ ఎత్తైన చెట్ల కి మంచి వాతావరణం కూడా తోడవడంతో ఆ ప్రదేశాలన్నీ అతి సుందరంగా సందర్శకుల మనసులను హాయి గొలుపుతున్నాయి.

ఆదివారం సాయంత్రం తమ తిరుగు ప్రయాణం ప్రారంభించారు. పగలంతా తిరిగి, కూతురు తో ఆడి, ఆడి కొంచెం అలసి పోయి వున్నాడు రాజేష్.   మాధవి, శ్రావ్య లయితే పూర్తిగా అలసి పోయి, కారు కదిలిన పది నిముషాల్లో నే గాఢ నిద్ర లోకి జారీ పోయారు.

ఒక గంట సేపు డ్రైవ్ తరువాత నిద్ర ముంచుకు రావడం మొదలైంది రాజేష్ కి, కనిపించిన ఒక రెస్ట్ ఏరియా లో కారు ఆపి చల్లటి నీళ్ల తో మొహం కడుక్కుని … మళ్ళీ బయలు దేరాడు.

కానీ మరో అరగంట లో పరిస్థితి మొదటి కొచ్చింది. మరో రెండు గంటలు నిగ్రహించు కోగలిగితే … ఇంటికి చేరు కోవచ్చు .. అనుకుంటూ నిటారుగా కూర్చొని … దృష్టి అంతా రోడ్ మీద నిలిపి డ్రైవ్ చేస్తున్నాడు .

సమ్మర్ వల్ల సాయంత్రం 9 గంటలు దాటినా ఇంకా పూర్తిగా చీకటి పడలేదు . హైవే మీద ట్రాఫిక్ పెద్దగా లేదు . బ్లూ టూత్ ఆన్ చేసి తెలుగు సినిమా పాటలు పెట్టాడు. మాధవి కి శ్రావ్య కి నిద్రా భంగం కలక్కుండా తక్కువ వాల్యూమ్ లో  పాటలు వింటూ కార్ డ్రైవ్ చేయ సాగాడు .

గత రెండు రోజులు గా కుటుంబం తో కలిసి చేసిన ఎంజాయ్ మెంట్ ని తల్చుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు రాజేష్ . ఇళయరాజా పాటలు వింటూ … ఆ మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తున్న రాజేష్ కళ్ళు ఒక్క క్షణం మూతలు పడ్డాయి . సడన్ గా కారు వెనుక ఎదో పెద్ద శబ్దం రావడంతో … ఉలిక్కి పడి కళ్ళు తెరిచిన రాజేష్ కి ఒక్క సెకను పాటు ఏమి జరిగిందో అర్ధం కాలేదు … కానీ తన హొండా ఒడిస్సి ఎవరో విసిరేసినట్టు రోడ్డు మీద నుండి పక్క నే వున్న లోయ లోకి పల్టీలు కొడుతూ జారీ పోవడం మాత్రం తెలుస్తూ వుంది …

మాధవి, శ్రావ్య ల ఆర్తనాదాలు రాజేష్ చెవుల్లో మారుమ్రోగు తుండగా …. రక్తపు మడుగులో తేలుతున్న రాజేష్ ఎదో తెలియని మైకం ఆవరించి తిరిగి రాని లోకాలకు చేరిపోయాడు .

గాఢ నిద్ర లో వున్నా మాధవి … శ్రావ్య లు పెద్ద శబ్దం తో ఉలిక్కి పడి … కళ్ళు తెరిచే లోపే … తమ శరీరాలు నజ్జు నజ్జు అయిపోయాయి … గొంతు చించు కొని ఒక్క క్షణం పాటు అరిచిన వారి గొంతులు … మూగ బోయాయి .. …. . ఒక్క క్షణం లో అంతా నిశ్శభ్డం … .

***

“శ్రావ్య .. శ్రావ్య … ” ఎవరో పిలుస్తున్నారు … చిన్నగా కళ్ళు తెరిచింది శ్రావ్య . ఎదురుగా కొన్ని ఆకారాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి .

“శ్రావ్య … ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ స్లో ” …. ఒక ఆకారం తన పైకి వంగి చెప్తుంది.  క్రమేణా ఎదురుగా ఉన్న ఆకారాలు పరిసరాలు స్పష్టంగా కనపడ సాగాయి.

తన మొహం లో కి తొంగి చూస్తూ మాట్లాడుతుంది ఓ అమెరికన్ డాక్టర్ అని అతని ప్రక్కన నిలబడింది ఒక అమెరికన్ నర్స్ అని శ్రావ్య గుర్తుపట్టింది .

తల తిప్పి చుట్టూ చూసింది … తానూ ఒక హాస్పిటల్ రూమ్ లో ఉన్నట్టు అర్ధం అయ్యింది.  దిగ్గున లేచి కూర్చుంది.

అమ్మ నాన్న కనిపించలేదు

“అమ్మా ” గట్టిగా పిలవాలని ప్రయత్నించింది ..తన గొంతు తనకే వినిపించ లేదు ..మళ్ళీ  ప్రయత్నించింది .. అరిచింది .. . . అరిచానని అనుకుంది .. కానీ గొంతు లోనుండి శబ్దం బయటికి రాలేదు . …

శ్రావ్య మోహంలో అనుమానం … భయం …వాటికి ఫలితంగా ఏడుపు  ఒక్క సారి గా వచ్చాయి …

డాక్టర్ ఆమెని పరిశీలనగా చూస్తూ … “relax.. please relax  ” అన్నాడు

నర్సు వైపు చూసి అన్నాడు ” she lost her ability to speak … her vocal card was damaged in the car accident ”

అది విన్న శ్రావ్య షాక్ కి గురి అయి … కాసేపు … బిత్తర పోయి చూసి ..హిస్టీరియా వచ్చిన దానిలా  వూగి పోతూ, వెక్కి వెక్కి ఏడవ సాగింది .

“మై మమ్మి …డాడీ  ” సైగ చేసి అడగడానికి ప్రయతించింది కానీ చేత కాలేదు.

డాక్టర్ నర్స్  కళ్ళలోకి చూసి సైగ చేశాడు … అర్ధం చేసుకున్న నర్సు శ్రావ్య కి బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చింది … రెండు క్షణాల్లో  మత్తుగా బెడ్ మీద వాలి పోయింది .

శ్రావ్య పూర్తిగా మత్తు లోకి జారుకుందని నిర్దారించు కొని … నర్సు తో అన్నాడు ” Don’t let her know  that her parents were dead in the accident. She may go to coma in this shock .. let’s wait for her to recover from the shock ”

నర్సు తలాడించింది .

***

కొన్ని నెలల తర్వాత

కారు ఆక్సిడెంట్ లో తన తల్లి తండ్రుల ను  కోల్పోయిన  శ్రావ్య జీవితం లో ఏకాంత గా మిగిలింది .. కారు దుర్ఘటన తర్వాత దాదాపు నెల రోజులు ఆసుపత్రి లో ట్రీట్ మెంట్ తీసుకొని చిన్నగా కోలుకుంది . . ఆక్సిడెంట్ లో గొంతుకు  తగిలిన బలమైన గాయాల వలన శ్రావ్య మాటలు రాని మూగదయింది.

అమ్మ నాన్న ల మధ్య ఆనందంగా పెరిగిన శ్రావ్య … ఈ హఠాత్ సంఘటన తో, జీవితం తిప్పిన మలుపుతో ఒంటరి గా … ఓ అనాధ లా దుఃఖ సాగరం లో మిగిలిపోయింది .

తన ఖర్చులు , ఇతర  అవసరాలు అన్ని తన తండ్రి చూసుకోవడంతో అసలు అలాంటి విషయాల్లో ఒక అవగాహన కూడా లేని శ్రావ్య ఇప్పుడు రోజూ తినే ఆహారం మొదలు కొని కాలేజ్ ఫీజు  ల  వరకూ అన్నీ తానే మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది .

ఇంటి కి లోన్ కట్టడం దేవుడెరుగు రోజు గడవడమే కష్ట మైన పరిస్థితుల్లో … ఇంటిని అమ్మేసింది . ఆ వచ్చిన కాస్త డబ్బు ను కాలేజ్ ఫీజు కట్టేసి … ఒక ఇంటిలో ఒక గది అద్దెకి తీసుకొని అందులో ఒంటరి గా గడుపుతుంది .

లోకల్ గా వున్న ఒక ఇండియన్ గ్రోసరీ స్టోర్ లో పని చేస్తూ తన  ఖర్చుల కి కావాల్సిన డబ్బు ని సంపాదించుకుంటుంది.

తన చిన్న కుటుంబంలో యువరాణి లా పెరిగిన శ్రావ్య … ఈ రోజు దీనంగా … ప్రతి రోజు తన గతాన్ని  … ఎప్పటికీ తిరిగి రాని తన తల్లి తండ్రుల ను తల్చు కుంటూ  తనలో తానె దుఃఖిస్తూ … ఏకాంత  జీవితాన్ని గడుపుతుంది .

పని నుండి రూమ్ కి రాగానే … చదువు కొని .. కాసేపు  ఏవో ఆలోచనల్లో మునిగి పోతూ ఉండే శ్రావ్య కి ఒక రోజు ఫేస్ బుక్ లో రానా పరిచయం అయ్యాడు .  ఎవరూ లేని తన ఒంటరి జీవితంలో ఒక ఆన్ లైన్ స్నేహితుడు గా మారి పోయాడు ఆతను.  మంచి మంచి జోక్స్ వేస్తూ నవ్వించే రానా స్నేహం,  శ్రావ్య కి  చీకటి లో ఓ చిరు దివ్వె లా వెలిగింది

తన పని , చదువు ల తో  పాటు అప్పుడప్పుడు రానా  తో ఫేస్ బుక్ లో చాట్  శ్రావ్య కి తన గతాన్ని కొంచెం కొంచెం గా మర్చి పోయేలా చేస్తుంది.

ఒక రోజు  అర్ధ రాత్రి నిద్ర లో, తన కల లోకి  తమ కుటుంబ విషాద సంఘటన అయిన కారు ఆక్సిడెంట్ , హాస్పిటల్లో డాక్టర్ తన కు గొంతు మూగ బోయిందని చెప్పడం  లాంటి విషయాలు  రావడం తో ఏడుస్తూ లేచి కూర్చింది శ్రావ్య .

తనకు అప్పుడపుడు ఈ కలలు రావడం సహజమే అయినా , కొంచెం గాప్ తరువాత మళ్లీ ఆ జ్ఞాపకాలు కలల రూపంలో రావడం తో ఆ రోజంతా పనికి కూడా వేళ్ళ కుండా తన గది లోనే ఒంటరిగా ఏడుస్తూ గడిపింది శ్రావ్య.

అసలు ఈ జీవితం ఎందుకూ అన్న విరక్తి ప్రారంభమైంది ఆమెకి. కూతురిని ప్రాణం కన్నా ఎక్కువ గా ప్రేమించిన ఆమె తల్లి తండ్రులు ఏ లోకాల్లో వున్నారో తెలీదు కానీ …. తన చిన్ని తల్లి దైన్య స్థితి ని చూస్తే మాత్రం వాళ్ల ఆత్మ శాంతించదు

ఆ రోజంతా అనుభవించిన తన మానసిక వ్యధ ని ఎవరితో నైనా పంచు కోవాలనిపించింది శ్రావ్యకి … కానీ ఆమె జీవితంలో తనకు అంటూ ఎవరూ లేరు .. ఆ రోజు సాయంత్రం ఫేస్ బుక్ చాటింగ్ లో రానా తో తన గతాన్ని గురించి చెప్పింది.

అది తెలుసు కున్న రానా , శ్రావ్య  కి  ఎంతో ధైర్యాన్ని ఇచ్చి  ఓదార్చాడు . నువ్వు ఒంటరి వి కాదని నీకు నేను తోడు ఉన్నానని రానా అనడంతో .. శ్రావ్య కి మళ్లీ జీవితం మీద ఆసక్తి కలగసాగింది.

ఇండియన్ స్టోర్ లో పని చేస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే సమాధానం చెప్పలేక , తాను మూగ ది అన్న విషయం గుర్తుకు వస్తుంది. అమ్మ నాన్న ల దగ్గర తాను చేసిన అల్లరి,  మాట్లాడిన మాటలు,  వాళ్ళ వెచ్చటి ఓదార్పు గుర్తుకు వచ్చి ఒక్కొక్క సారి  తీరని నిస్పృహ లోకి వెళ్లి పోతుంటుంది .

ఒక  రోజు ఫేస్ బుక్ లో రానా చెప్పాడు  తమ పరిచయం ఏర్పడి నేటికీ సరిగ్గా ఒక సంవత్సరం అయింది అని . తనకు శ్రావ్య ని నేరుగా కలవాలని వుంది అని కోరాడు .  తన జాబ్ లో భాగంగా అతను  శ్రావ్య వుండే వూరికి వస్తున్నాడు .

అది చూడగానే శ్రావ్య కి ఎక్కడా లేని అనందం కలిగింది … కానీ వెంటనే అనేక అనుమానాలు మొదలైయ్యాయి .  తాను మాట్లాడలేను అన్న విషయం అప్పటి వరకూ రానా కి చెప్పలేదు .

అది తెలిస్తే రానా స్నేహన్నీ కోల్పోవాల్సి వస్తుందని ఆమె సందేహం .  ఎవరైనా కోరి కోరి మూగ పిల్ల తో స్నేహం చేయరు  అని ఆమె అభిప్రాయం .

ఓ  సంవత్సరం పాటు  సాగిన తన స్నేహం లో తనకి తెలియ కుండానే రానా పట్ల ఓ సున్నితమైన ఇష్టాన్ని పెంచు కుంది శ్రావ్య .

ఆతను తన జీవితంలో శాశ్వతంగా ఉంటే , ఓ తోడుగా నిలిస్తే బాగుండు కదా అని ఆశ పడుతుంది

కానీ ఇప్పుడు అతని తో  నేరుగా కలిస్తే తన లోపం అతనికి తెలిస్తే , తనకు దగ్గర అవ్వాల్సింది పోయి దూరం అవుతాడని భయం .

రానా ఆమెని పదే పదే  అడుగుతున్నాడు … రేపు సాయంత్రం కలుద్దామని … రిక్వెస్ట్ చేశాడు … తనకి మళ్ళి ఈ అవకాశం రాదు అని  వేడుకున్నాడు … కానీ శ్రావ్య అందుకు సమాధానం చెప్పలేక … కొంచెం టైం ఇవ్వమని … ఆలోచించి చెప్తాను అంది .

అప్పటి నుండి తనలో తాను  ఘర్షణ పడసాగింది  ..

“వెళ్ళాలా  ?   వద్దా ?”

అయినా ఎంత కాలం ఈ విషయాన్ని దాచ గలదు ? ఎప్పటికైనా తాను మూగ అన్న విషయం బయట పడక మానదు … అలంటి అప్పుడు దాచి ఏమిటి ప్రయోజనం ?

”  తనని తానుగా అతను ఇష్టపడక పొతే … ప్రేమ ఎలా అవుతుంది ?   వెళ్తాను … అతను తనని అంగీకరించినా … అంగీకరించక పోయినా సరే … ”  అని  చివరికి నిర్ణయించుకుంది .

తనకున్న డ్రస్ ల నుండి … ఒక మంచి డ్రెస్ ని ఎంచుకొని .. ఆ రోజు సాయంత్రం రానా ని కలవడానికి బయలు దేరింది .

***

ఈ రోజు సాయంత్రం పెన్ స్టేట్  యూనివర్సిటీ లో , శ్రావ్య కి ఇష్టమైన బయాలజీ బ్లాక్ లో  రానా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు .

లోకల్ బస్ లో  పెన్ స్టేట్ యూనివర్సిటీ  కి  చేరుకుంది .. బస్ స్టాప్ నుండి బయాలజీ బ్లాక్ కి  కనీసం ఒక మైలు దూరం నడిచి వెళ్ళాలి.

వడి , వడి  పరుగులాంటి నడకతో వెళ్తుంది శ్రావ్య .. మనసు నిండా ఆలోచనలు …  . …

రానా ఫోటో ను ఫేస్ బుక్ లో చాలా సార్లు చూసింది .. .ఆతను చూడడానికి బాగుంటాడు …తాను యావరేజ్ గా ఉంటుంది …   అతని కి నచ్చు తానో లేదో …

తనకు మాటలు రావు అన్న విషయం అతనికి నిరాశ కలిగిస్తే … అసలు ఆ విషయం తానూ ఇంత కాలం చెప్ప లేదని … ఆతను ఏమైనా అపార్ధం చేసుకుంటాడేమో !

నడుస్తున్న ఆమెకు  భయం … ఆశ … నిరాశ అన్ని భావాలు ఒకే సారి కమ్ముకుంటున్నాయి.

పది నిముషాల్లో బయాలజీ బ్లాక్ ను చేరుకుంది.

మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి వున్నాడు రానా . ఎవరితోనో మాట్లాడు తున్నట్టు వున్నాడు.

కొంచెం దూరంగా ఆగింది శ్రావ్య .  రానా వంక చూస్తుంది ..

ఎవరో ఒకతను రానా ని ఎదో అడ్రస్ అడుగుతున్నాడు … రానా తనకు తెలియదు అని చెప్తున్నాడు … కాదు అతను చెప్పట్లేదు …

నిశ్చేష్టురాలు అయ్యింది శ్రావ్య !

రానా ఎదుటి వ్యక్తి కి … తనకి ఆ అడ్రస్ తెలియదని మాటల్లో చెప్పట్లేదు … సైగలతో చెప్తున్నాడు.

ఎదుటి వ్యక్తి మరేదో అడుగుతున్నాడు … రానా తనకి మాటాలు రావని మూగ భాష లో అతనికి చెప్తున్నాడు.

శ్రావ్య కి ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు … అయోమయంగా … రానా వంక చూడ సాగింది.

రానా ని అడ్రస్ అడిగిన వ్యక్తి … సారి చెప్పి వెళ్ళిపోయాడు . అతను అలా వెళ్ళగానే అటు ఇటూ చూస్తున్న రానా కళ్ళలో పడింది శ్రావ్య.

దూరంగా నిలబడి తన వైపు తదేకంగా చూస్తున్న శ్రావ్య ని గుర్తుపట్టాడు రానా.

జరిగింది అర్ధమయ్యింది అతనికి … తాను మూగ వాడిని అన్న విషయం శ్రావ్య కి తెలిసింది అని అతనికి అర్ధం అయ్యింది.

సంశయంగా శ్రావ్య వంక చూడసాగాడు …చిత్తరువుల్లా నిలబడి పోయిన ఆ ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు మౌనంగా దొర్లిపోయాయి.

అప్పటి వరకూ తాను అనుభవిస్తున్న మానసిక సంఘర్షణ , రానా కూడా పడుతున్నాడని శ్రావ్య కి అర్ధం అయ్యింది.

మొదట శ్రావ్య కళ్ళల్లో కన్నీళ్ళు … ఆ తరువాత  మోహంలో చిన్న నవ్వు  తో ప్రారంభమైన  ఆనందం, ఆమె మోహంలో వెలుగు ని నింపింది.

తన చేతిని ఊపుతూ హాయ్ చెప్పింది రానా కి.

అది చూసి బరువు ఎక్కిన  రానా గుండె లు తేలిక పడ్డాయి  ..తాను సంకోచంగా చేయి ఊపుతూ హాయ్ చెప్పాడు. శ్రావ్య మోహంలో ఆనందం చూసి … రానా లో నూ ఆనంద రేఖలు వెళ్లి విరిశాయి.

అనుమానాలు పటా పంచలు అయిన ఆ ఇద్దరి మనసులు తేలిక పడి   … తెలియని ఉద్వేగం తో నిండి పోయాయి.

శ్రావ్య చిన్నగా కదిలి … నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ రానా  దగ్గర గా వేళ్ళ సాగింది … రానా అది చూసి కాసేపటికి తేరు కొని … చిరు నవ్వుతో …  శ్రావ్య వైపు అడుగులు వేయ సాగాడు .

*** సమాప్తం ****

Written by …. Prasad Thota