భాగవతం ఒక విజ్ఞాన నిధి: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

వాస్తవం ప్రతినిధి: సమన్వయ సరస్వతి, ప్రవచన విరించి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, రాజమహేంద్రవరం లోని విరించి వానప్రస్థ ఆశ్రమం లో ఫిబ్రవరి 2 వ తారీఖు నించి శ్రీమద్భాగవత మహాయజ్ఞం ప్రవచనాలు ప్రారంభించారు. ఈ ప్రవచనం నిర్విరామం గా 42 రోజులపాటు సాగుతుంది. సుదర్శన హోమము తో ఈ ప్రవచన మహాయజ్ఞం మొదలయ్యింది. ఆద్యంతం అతి రమ్యంగా, అమృత ధారలాగా సాగుతున్న ఈ శ్రీమద్భాగవత ప్రవచనాలను, రాజమహేంద్రవరం లో ప్రత్యక్షం గా వింటున్న వారే కాకుండా, సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలమంది ఆస్వాదిస్తున్నారు. నిర్వాహకులు “ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ” ఫేస్బుక్ పేజీ ద్వారా ప్రతిరోజూ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6:30 నించి 8:30 వరకు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

ప్రవచనాంతర్గతంగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్యాస మూలము అయిన సంస్కృత శ్రీమద్భాగవతం నుండి ప్రతి వృత్తాంతమును, ప్రతి ఘట్టాన్నీ, తాత్విక, ఆధ్యాత్మిక అర్ధాలతో సహా ఎంతో విపులంగా వివరిస్తున్నారు. భాగవతం ఒక విజ్ఞాన నిధి అని, దీనిని కేవలం ఒక మత గ్రంధం గా చూడటం వలన, మానవ జీవితాలకి కావాల్సిన ఎంతో అపురూపమైన విజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నామని ఆయన అన్నారు.
పిల్లలు పోతన భాగవతం లోని శ్లోకాలను చదివితే వారి బుద్ధి, ఆయువు వృద్ధి చెందుతాయని, ఆ పద్యాలలో, ఆ పదాల పొందికలో ఎన్నో ప్రాణాయామ విశేషాలు దాగున్నాయని అన్నారు. పురాణాలు కాలక్షేపం కోసమో, రిటైర్ అయిపోయినవాళ్ళకోసం మాత్రమేనో కాదని, ఎంత చిన్న వయసు నించి వింటే అంత ధర్మబద్ధంగా, ఆనందం గా జీవితాన్ని సరిదిద్దుకోవచ్చని అన్నారు. సనాతన ధర్మ వైభవాన్ని పెడర్ధాలు తీసి తప్పుదారి పట్టించటంవలననే పరమత దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పృథు చక్రవర్తి వృత్తాంతం ద్వారా ఈ కాలానికి కూడా సరిగ్గా సరిపోయే ఎన్నో రాజనీతి పాఠాలు తెలుసుకోవచ్చని, భాగవతం ఒక పొలిటికల్ సైన్సెస్ ఎన్సైక్లోపీడియా అని అన్నారు. అదే విధం గా, కపిల గీత, జడభరతుని వృత్తాంతం, ధ్రువ చరిత్ర, ప్రహ్లాద నృసింహ సంవాదం, గజేంద్రమోక్షం మొదలయిన ఘట్టాలను హృద్యం గా వివరిస్తూ గృహస్థాశ్రమ ధర్మాలను, జీవితాన్ని సరిదిద్దుకోటాని ఉపయోగపడే ఎన్నో విషయాలను మనసుకు హత్తుకునేలా బోధిస్తున్నారు. పిల్లలనుంచి పెద్దవారి వరకూ ఈ ప్రవచనాలకి ప్రతి రోజూ హాజరవుతున్నారు. మరుసటి రోజు ప్రవచనం ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నామని వారు అంటున్నారు .

– రాధికా కామేశ్వరి.