బాసర సరస్వతీ ఆలయ విశిష్టత

వాస్తవం ప్రతినిధి: బాసర తెలంగాణా రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లాలోని ముధోల్ మండలానికి చెందిన గ్రామము, చదువుల తల్లి పరమ పుణ్యక్షేత్రం. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరంలో నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది ఈ పుణ్యక్షేత్రం. ఇది దేశంలోని అతి పురాతన ఆలయాలలో ఒకటి కాగా భారతదేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే.

బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. హిందూ మతం పురాణాల ప్రకారం, వేదవ్యాస మహర్షి తపస్సు చేస్తే అప్పుడు జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్టించాడు. వారు సరస్వతి, లక్ష్మీ మరియు కాళి. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. సరస్వతీదేవి ఆలయం సమచతురస్రాకారంలో ఉంటుంది. ఆలయానికి దక్షిణభాగాన కోనేరు ఉంది. దీనిని ‘గుండం’ అని ప్రాంతీయులు పిలుస్తారు. దానికి ప్రక్కగా ఒక సమాధి ఉంది. దానిని ‘వాల్మీకి సమాధి’ అని అర్చకులు భక్తులకు పరిచయం చేస్తారు. శివరాత్రి మొదలు ఇక్కడ ఉత్సవాలు చేస్తారు.

ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది.ఇంతటి వైశిష్ట్యాన్ని పునికిపుచ్చుకున్నందువలననే మన తెలుగు రాష్ట్రాల లోని వారే కాకుండా యితర రాష్ట్రాల నుండి సైతం పసి పిల్లలకు “అక్షర స్వీకారం” చేయించడం సంప్రదాయంగా వస్తుంది.ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా పూజ జరుపుతారు.ఉదయము 4 గంటలకు ఆలయద్వారాలు తెరచి 4 గంటల నుండి 4.30 గంటల వరకు అభిషేకము టిక్కెట్లను ఇస్తారు. 4 గంటల నుండి 7.30 గంటల వరకు అభిషేకము, అలంకారము, హారతి, నైవేద్యము చేసి ప్రసాద వితరణ చేస్తారు. 7.30 గంటల నుండి 12.30 గంటల వరకు అర్చన, సర్వదర్శనం ఇతర పూజలు చేస్తారు. 12.30 గంటలకు నివేదన చేసి ఆలయము 2 గంటవరకు మూసి ఉంచుతారు. 2 గంటల నుండి 6.30 గంటల వరకు అర్చన సర్వదర్శనం చేస్తారు. 6.30 గంటల నుండి 7 గంటల వరకు ప్రదోష పూజ నిర్వహిస్తారు. 7 గంటల నుండి 8.30 గంటల వరకు మహా హారతి దర్శనం తరువాత ఆలయము మూసి వేస్తారు.

ముఖ్యముగా విద్యా ప్రాప్తికై ఇక్కడ విధ్యార్దులతో అక్షరాభ్యాసము చేయించి దేవికి పలక, బలపము, కాగితము, కలము వంటి కానుకలు సమర్పించే ఆచారము ఉంది. కేశ ఖండనము, ఉపనయనము, వివాహాలు, భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి.ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. శ్రీ పంచమి మరియు నవరాత్రి పండుగలు ఆలయం వద్ద పెద్ద ఎత్తున జరుపుకుంటారు.