శ్రావణ భాద్రపదాలు

చిరుజల్లుల చిట పట లు, పట్టు చీరలు, పావడాలా గర గరలు, పన్నీరు ఘుమ ఘుమలు,సెనగలు, పళ్ళు, వాయినాలు, సన్నాయి వాయిద్యాలు,పెళ్లిళ్లు, పండుగలు , పేరంటాలు, పెద్దల కబుర్లు, పిల్లల ఆటలు, నవ్వులు… శ్రావణ భాద్రపదాలు అంటే గుర్తొచ్చే విషయాల్లో ఇవి కొన్ని.
అప్పటివరకూ గ్రీష్మ తాపం లో కొట్టుమిట్టాడిన జీవకోటి కి చల్లని గాలి తెమ్మెరలు, తొలకరి జల్లులూ, ఉరుములు, ఫెళ ఫెళ మెరుపులతో కుండపోత వర్షాలతో పాటు, ఎండిపోతున్న నదీ నదాలకి తిరిగి జలకళ, జీవ కళ తిరిగి తెచ్చేవి శ్రావణభాద్రపదాలే!
” శ్రావణ భాద్రపదాలు” అని సామెత కూడా ఉంది. ఎప్పుడూ సందడిగా హడావిడి గా ఉండే మనుషులని శ్రావణ భద్రపదాలు అని పిలవటం కద్దు .
పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రం లో ఉంటాడో ఆ నెలకు ఆ నక్షత్ర నామమే మాసనామం గా ఉంటుంది. చంద్రుడు శ్రవణా నక్షత్రం లో ఉన్నప్పుడు  శ్రావణ మాసం అని, అలాగే పూర్వభాద్రా నక్షత్రం లో ఉన్నప్పుడు భాద్రపద మాసం అని అంటారు.
చాతుర్మాస్య వ్రతం చేసేవారికి శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ,కార్తీక మాసాలు చాల ముఖ్యమైనవి. శ్రావణ భాద్రపదాలలో వచ్చే పండుగలకు పర్వాలకీ తక్కువే లేదు. శ్రావణ  మంగళ గౌరీ వ్రతము, వరలక్ష్మీ వ్రతం, ప్రాంతాలని  బట్టి, నాగుల చవితి, నాగపంచమి, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శని వారం, శ్రావణ సోమవారం వారాలను శ్రద్ధగా పాఠిస్తారు. శ్రావణ మాసం లో వచ్చే మరో ముఖ్యమైన పండుగ శ్రీ కృష్ణ జన్మాష్టమి!కృష్ణ పాదాలు వెయ్యటం, కృష్ణుడికి,  రాధా కృష్ణులకు విశేష పూజలు, ఆరాధన చేస్తారు. చిన్న పిల్లలకి కృష్ణుడు, రాధా దేవి, గోపికల వేషాలు వేసి మురిసిపోవటం మనం చూస్తూ ఉంటాము. పదేళ్ల లోపు పిల్లలతో పారాణి లో ముంచిన కాళ్లతో నడిపించి కృష్ణ పాదాలు వేయిస్తూ ఉంటారు.
ఇక భాద్రపద మాసానికి ఉన్న విశిష్టత వేరు. ఈ మాసంలో మొదటి తిథి మొదలుకుని పౌర్ణమి వరకూ ప్రతి రోజూ ఒక పర్వ దినమే. ఈ మాసంలో వచ్చే అతి పెద్ద పండుగ వినాయక చవితి!!  చిన్నా పెద్దా, పిల్లా పాపా అంత కలిసి చేసుకునే పండుగ!!
ఈ పండుగకి నవరాత్రులు చెయ్యటం పరిపాటి. బాల గంగాధర్ తిలక్ స్వతంత్ర సమరం సమయం లో ప్రజలలో ఐకమత్యం కోసం మొదలుపెట్టిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు , ఇంట్లో చేసుకునే పూజల నించి నలుగురూ కలిసి చేసుకునే పండుగగా మార్చింది.  భాద్రపద మాసం లో వచ్చే మరెన్నో పర్వ దినాలు ఏమిటంటే రాధా అష్టమి , వామన జయంతి, రిషి పంచమి. ఇవే కాక, భాద్రపద శుక్ల చతుర్దశి రోజు అనంత పద్మనాభ స్వామి వ్రతం విశేషం గా చేసుకుంటారు. ఇక భాద్రపద పౌర్ణమి తరవాత మహాలయ పక్షాలు మొదలవుతాయి. ఇది పితృ దేవతలని పూజించే ముఖ్యమైన కాలం. ఇటు దేవతలకి, ఋషులకి, పితృ దేవతలకు కూడా ప్రీతి కరమైన పూజలు చేసుకోగల కాలం భాద్రపద మాసం మాత్రమే. మహాలయ అమావాస్య రోజున పితృ దేవతలకి విశేషమైన తర్పణాలు, పూజలు చేస్తారు.
ఇలాగ, శ్రావణ భాద్రపదాలు వర్షాలు, వాతావరణం లో మార్పులతో పాటు, బోలెడు పండుగలు , పర్వదినాలు కూడా మూటగట్టుకుని వస్తాయి. మన ప్రతి మాసం లో ఎన్నో ఎన్నెన్నో విశేషాలు దాగి ఉంటాయి.
Written By … Radhika Bukka